అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా లేదా అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా.. రికార్డులు సృష్టించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాగే అత్యధిక నష్టాలను చూసిన సినిమాగా చెత్త రికార్డు నెలకొల్పే చిత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాల సరసన ‘కంగువా’ (Kanguva) చేరింది.
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’. యూవీ క్రియేషన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ, భారీ అంచనాలతో నవంబర్ 14న విడులైంది. మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న కంగువా, దారుణంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా మూవీ స్థాయికి తగ్గట్టుగా కనీస వసూళ్లు రాబట్టలేక, బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. దీంతో బయ్యర్లకు ఏకంగా రూ.130 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి, ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
నిన్న మొన్నటి దాకా ఈ బిగ్గెస్ట్ డిజాస్టర్ ట్యాగ్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’కి ఉంది. ఆ సినిమా రూ.120 కోట్లకు పైగా నష్టాలను చూసింది. అలాంటిది ఇప్పుడు ‘రాధేశ్యామ్’ని దాటేసి, ‘కంగువా’ ఈ దారుణమైన రికార్డుని మూటగట్టుకుంది.