1997లో విడుదలైన పెళ్లిపందిరి చిత్రంతో పంపిణీదారుడిగా కెరీర్‌ను ప్రారంభించి అనతి కాలంలోనే నిర్మాతగా మారి దిల్ చిత్రంతో దిల్‌రాజుగా పేరు తెచ్చుకున్నారు వి.వెంకటరమణారెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై రెగ్యులర్‌గా సినిమాలు నిర్మించే దిల్‌రాజుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక పదవిని అప్పగించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఆయన్ని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దిల్‌రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
గత 35 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఉన్న దిల్‌రాజు ఇండస్ట్రీని మరింత అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్టు తెలియజేశారు. నూతన నటీనటులను, దర్శకనిర్మాతలను ప్రోత్సహించడంతోపాటు సినిమాల ఫెయిల్యూర్స్‌ను తగ్గించేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ఓ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా ఏడాదికి ఐదు సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఈనెలలోగానీ, వచ్చే ఏడాది జనవరిలోగానీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా నటీనటులు, రచయితలు దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నామని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేయాలన్న ఉద్దేశంతోనే దిల్‌రాజు డ్రీమ్స్‌ను స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై మూడు సినిమాలు నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సినిమాతోపాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. నితిన్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తమ్ముడు’ చిత్రానికి కూడా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.