కర్మలద్వారా కర్మనాశనం ఎప్పటికీ జరుగదు. ఒక కర్మకు మరొక కర్మ ఎప్పటికీ విరుగుడు కాదు. ఏ కర్మకయినా దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దానినుంచి పుట్టే సంస్కారాన్ని మనసులో పేరుకుంటుంది. ప్రాయశ్చిత్తం కూడా ఒక కర్మే. అది అశుభ కర్మ ఫలాన్ని నిర్మూలించినా లేదా తగ్గించినా అటువంటిది మళ్ళీమళ్ళీ చేయకుండా నివారించలేదు. అలా చేసే సంస్కారాన్ని అది నాశనం చేయలేదు. ఎందుకంటే అజ్ఞానం వల్ల ఆ సంస్కారం నశించలేదు. మరి దుష్కర్మలను చేసే సంస్కారాన్ని తొలగించుకోవడం ఎలా? అంటే సాధన ఒక్కటే మార్గం అని ఆయన చెప్పారు. ఆ సాధనాలు ఏమిటంటే.. యమనియమాలు, తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, సత్యనిష్ఠ అని ఆధ్మాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సాధన ద్వారా చిత్తశుద్ధి, దానిద్వారా జ్ఞానం కలుగుతుంది. భక్తిద్వారా, ఆత్మసమర్పణ ద్వారా పాపాలను తొలగించుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.