ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాన్‌ ఇండియా హీరోల్లో ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్నవారు లేరు. కానీ, డార్లింగ్‌ ప్రభాస్‌ అలా కాదు. వచ్చిన సినిమాలన్నింటినీ ఓకే చేస్తూ తన లైనప్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఎలాంటి టెన్షన్‌ లేకుండా సినిమాలను పూర్తి చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్‌’ నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్‌. ‘ది రాజా సాబ్‌’ ఏప్రిల్‌ 10న సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. కానీ, ఆ డేట్‌కి రాజా సాబ్‌ రాకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కెజిఎఫ్‌, కాంతార, సలార్‌ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ వారు ప్రభాస్‌తో ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

హోంబలేతో ప్రభాస్‌ చేయబోయే మూడు సినిమల్లో ఒక సినిమాకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. అదేమిటంటే.. కాంతార ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ఒక పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ రెడీ చేశాడు. అది విన్న హోంబలే ఫిలింస్‌ వారు ఆ కథ ప్రభాస్‌కి అయితే పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని ఫీల్‌ అయ్యారట. ప్రభాస్‌తో చేయబోయే మూడు సినిమాల్లో ఒక సినిమాకి ఈ కథని ఫిక్స్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు కాంతార చాప్టర్‌ 1 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రిషబ్‌. హోంబలేతో ప్రభాస్‌ చేయబోయే మిగతా రెండు సినిమాల్లో ఒకటి ప్రశాంత్‌ వర్మ, మరొకటి లోకేష్‌ కనకరాజ్‌ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇది బయట వినిపిస్తున్న మాట మాత్రమే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ అవి పూర్తయిన తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే స్పిరిట్‌ సెట్స్‌కి వెళతారు. ఇప్పుడు ప్రభాస్‌ చేతిలో తీరిక లేనన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ పాన్‌ ఇండియా సినిమాలే కావడంతో అవి పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పడం కష్టం. అంతేకాకుండా ప్రభాస్‌ చెయ్యాల్సిన సలార్‌, కల్కి సీక్వెల్స్‌ కూడా ఉండనే ఉన్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్‌ అవుతాయో, ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో కూడా అర్థంకాని పరిస్థితి ఉంది. ఏది ఏమైనా రాజాసాబ్‌ రిలీజ్‌ అయితేనే మిగతా సినిమాలు ఎప్పుడు స్టార్ట్‌ అవుతాయి, ఎప్పుడు రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తారు అనే విషయాలు తెలుస్తాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here