మంచు కుటుంబంలో వివాదాలు భగ్గుమన్నాయి. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆయన అనుచరుడితో తనపై దాడి చేయించాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మనోజ్ పై దాడి జరిగిందని, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మోహన్ బాబు పీఆర్ చెప్పుకొచ్చింది. కానీ మనోజ్ గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు. దీంతో నిజంగానే దాడి జరిగి ఉంటుందని అర్థమైంది. అదే సమయంలో అసలు ఈ దాడికి కారణమేంటనే చర్చలు జరుగుతున్నాయి. (Manchu Manoj)
తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో.. మనోజ్ కి సత్సంబంధాలు లేవని కొంత కాలంగా ఆ కుటుంబంలో జరగుతున్న పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా, విష్ణు తన వాళ్లపై దాడి చేయడానికి వచ్చాడంటూ మనోజ్ చెప్పినట్టుగా ఉన్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. అప్పటినుంచి వీరి మధ్య ఏదో జరుగుతుందనేది అందరికీ క్లారిటీ వచ్చింది. పైగా మనోజ్ పెళ్లి టైంలో కూడా.. ఆయన సోదరి లక్ష్మి తప్ప, మిగతా కుటుంబ సభ్యులంతా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు.
అయితే మంచు కుటుంబంలో విభేదాలకు కారణం.. ఆస్తుల పంపకమే అని తెలుస్తోంది. మోహన్ బాబు ఇప్పటికే ఆస్తులు పంచేశారు. శంషాబాద్ సమీపంలో ఓ ఇల్లు కట్టుకున్న మోహన్ బాబు.. తన జూబ్లిహిల్స్ ఇంటిని కూతురు లక్ష్మికి ఇచ్చేసి వెళ్లిపోయారు. పెద్ద కొడుకు విష్ణు కూడా మోహన్ బాబుతో పాటే ఉంటున్నాడు. మనోజ్ మాత్రం వేరేగా ఉంటున్నాడు. అయితే ఆస్తుల పంపకం విషయంలో అసంతృప్తే.. మనోజ్ దూరంగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది.
మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేది విద్యా సంస్థలే. కానీ ఆ విద్యా సంస్థలను మనోజ్ కు కాకుండా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో దానిలో హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని చెబుతున్నారు.
మోహన్ బాబు యూనివర్శిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు.. మనోజ్ భిన్నంగా స్పందించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అండగా ఉంటానని చెప్పడమే కాకుండా.. యూనివర్సిటీ విషయంలో తనకూ బాధ్యత ఉందన్నట్లుగా మాట్లాడాడు. మోహన్ బాబు, విష్ణు మాత్రం.. యూనివర్సిటీతో మనోజ్ కి సంబంధం లేదని వాదిస్తూ ఉండటం వల్ల.. అసలు సమస్య ప్రారంభమయిందని అంటున్నారు.
ఈ అంశంపైనే మోహన్ బాబు నివాసంలో శనివారం రాత్రి సమావేశమయ్యారు. ఆ సమయంలో మాట మాట పెరగడంతో మోహన్ బాబు తన అనుచరుడు, యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ అనే వ్యక్తిని ప్రేరేపించి కుమారుడని కొట్టించారని చెబుతున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రావడంతో తమపైన కూడా మనోజ్ దాడి చేశాడని, మోహన్ బాబు వర్గం ఆరోపించిందట. ఆ తర్వాత ఈ విషయం పోలీస్ కేసుల వరకూ వెళ్తే, కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో.. మనమే మాట్లాడుకొని పరిష్కరించుకుందామని, మనోజ్ ను కన్విన్స్ చేశారట. కుటుంబ వివాదం కావడం, పైగా ఇరు పక్షాలు మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని చెప్పడంతో.. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారట.
కానీ ఈ విషయం బయటకు పొక్కింది. మొదట ఈ వార్తలను మోహన్ బాబు వర్గం ఖండించింది. కానీ మనోజ్ గాయాలతో హాస్పిటల్ కి వెళ్లడంతో.. దాడి నిజమేనని అందరూ భావించారు. పైగా, మీడియాతో దాడి గురించి మాట్లాడేందుకు ఇష్టపడని మనోజ్.. మౌనం అర్థాంగీకారం అన్నట్టుగా.. దాడి జరగడం నిజమేనని క్లారిటీ వచ్చేలా చేశాడు.
మొత్తానికైతే యూనివర్శిటీలో భాగం విషయంలో మనోజ్ వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.