ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప-2’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ ప్రభంజనం కనీసం నెల రోజుల పాటు కొనసాగే అవకాశముంది. అందుకే ఈ టైంలో తమ సినిమాలను విడుదల చేయడానికి ఇతర నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటిది పుష్ప నిర్మాతలే తాము నిర్మించిన మరో సినిమాని ‘పుష్ప-2’ విడుదలైన మూడు వారాలకే విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం విషయంలో ఆలోచనలో పడ్డారు. (Pushpa 2 The Rule)

 

‘భీష్మ’ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కానుంది. అయితే అదే మైత్రి సంస్థ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదలై, సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నిజానికి ‘రాబిన్ హుడ్’ విడుదల తేదీని ప్రకటించినప్పుడే.. డిసెంబర్ 5న ‘పుష్ప-2’ విడుదల ఉంచుకొని తక్కువ రోజుల వ్యవధిలో విడుదల అవసరమా పలువురు అభిప్రాయపడ్డారు. అయితే అప్పుడు నిర్మాతలు, 20 రోజుల గ్యాప్ ఉంది కదా.. సరిపోతుందని భావించారు. కానీ ప్రస్తుతం పుష్ప-2 బాక్సాఫీస్ ఊచకోత చూస్తుంటే, ఇప్పట్లో ఆ ప్రభంజనం ఆగేలా కనిపించడంలేదు. అందుకే పుష్ప-2 ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని, ‘రాబిన్ హుడ్’ని వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. కానీ ఈ నిర్ణయం పట్ల హీరో నితిన్ మాత్రం అందుకు సుముఖంగా లేడట. (Robinhood)

 

ఎంత పుష్ప-2 ప్రభావం ఉన్నప్పటికీ.. అప్పటికి మూడు వారాలు అవుతుంది కాబట్టి, 50 శాతం థియేటర్లు అయినా ‘రాబిన్ హుడ్’కి కేటాయించే అవకాశముందని నితిన్ భావిస్తున్నాడట. అలాగే ఈ క్రిస్మస్ సీజన్ మిస్ అయితే, మళ్ళీ ఇప్పట్లో మంచి రిలీజ్ డేట్ కూడా దొరకదని ఆయన ఆలోచనట. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి సీజన్ పై భారీ సినిమాలు కర్చీఫ్ వేశాయి. ఇక ఫిబ్రవరిలో నితిన్ నటిస్తున్న మరో సినిమా ‘తమ్ముడు’తో పాటు, పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ లోనూ భారీ సినిమాలున్నాయి. ఈ లెక్కలన్నీ వేసుకొని, ఇప్పుడు విడుదల చేయడమే కరెక్ట్ అని నితిన్ బలంగా నమ్ముతున్నాడట. మరి ‘రాబిన్ హుడ్’ విడుదలపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here