హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల రోడ్ల విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా జూబ్లీ హిల్స్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో కెబిఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జీలు నిర్మించాలన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కెబిఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్డును విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.1090 కోట్లతో 8 స్టీల్ బ్రిడ్జిలు, 6 అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే భూసేకరణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలకు మార్కింగ్ చేసే కార్యక్రమం గత ఆరు నెలలుగా జరుగుతోంది. ఇప్పుడు దాన్ని వేగవంతం చేశారు. మార్క్ చేసిన భవనాలలో హీరో నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డికి చెందిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 అడుగుల మేర మార్క్ చేశారు. ఇదిలా ఉంటే.. నందమూరి బాలకృష్ణ నూతన గృహ నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. జూబ్లీ హిల్స్‌లోని చిరంజీవి నివాసం దగ్గరలోనే బాలకృష్ణ కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ఆయన కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆయన ఇంటికి అధికారులు మార్కింగ్ చేశారు.