హిందూ ధర్మం ప్రకారం ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని నమ్మిక. అయితే ఏకాదశి తిథుల్లో మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి మరింత విశిష్టత ఉంటుంది. దీన్ని సఫల ఏకాదశిగా పిలుస్తారు. సఫల అంటే అభివృద్ధి, ఫలించడం అని అర్థం. జీవితంలో ఆనందం, విజయం, ధనాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రోజుగా భావిస్తారు. హిందూ నమ్మకాల ప్రకారం.. ఈ రోజు శ్రీహరినీ, లక్ష్మీ దేవినీ, శ్రీ కృష్ణుడిని పూజించడం వల్ల భక్తులకు శాంతి, ఆరోగ్యం, ధనం, శుభం కలుగుతాయి. సకల పాపాలు తొలగిపోతాయి. శరీర సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిళ్ళు తొలగిపోతాయని నమ్మిక. పురాణాల ప్రకారం సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే జీవితంలోని బాధలు తొలగిపోతాయి. సఫల ఏకాదశి తేదీ, శుభ సమయం, పూజావిధానం, ఉపవాస సమయాలను తెలుసుకుందాం.