డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌ ఆవరణలో జరిగిన దుర్ఘటన గురించి తెలిసిందే. ఒక మహిళ మృతి చెందడమే కాకుండా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే థియేటర్‌ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే థియేటర్‌ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. ఒక మహిళ మృతికి దారి తీసిన అక్కడి పరిస్థితుల వల్ల సినిమాటోగ్రాఫ్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో అడిగారు. వీటిపై పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ  నోటీస్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. థియేటర్‌ను పరిశీలించిన పోలీసులు.. వారు గమనించిన లోపాలివి.. సంధ్య 70ఎంఎం, సంధ్య 35 ఎంఎం థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.. ఎంట్రీ మరియు ఎగ్జిట్‌ గేట్లు ఒకే వైపు ఉన్నాయి. అంతేకాదు, ఎంట్రీ, ఎగ్జిట్‌లను సూచించే సైన్‌ బోర్డుఉలు లేవు. రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2,500 మంది ప్రేక్షకులకు కూర్చునే వీలుంది. అనుమతి లేకుండా థియేటర్‌ బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రేక్షకులు అక్కడ ఎక్కువగా గుమికూడేందుకు అవకాశం ఇచ్చారు. థియేటర్‌లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. అల్లు అర్జున్‌ రాక గురించి ముందుగానే తెలిసినా స్థానిక పోలీసులకు తెలియజేయడంలో విఫలమైన థియేటర్‌ నిర్వాహకులు. అల్లు అర్జున్‌ రాకపై యాజమాన్యానికి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్‌ సీటింగ్‌ ప్లాన్‌ చేయలేదు. హీరోతోపాటు అతని ప్రైవేట్‌ సెక్యూరిటీని కూడా థియేటర్‌ లోపలికి అనుమతించారు. అంతేకాదు, టికెట్లను తనిఖీ చేసేందుకు సరైన వ్యవస్థ లేదని పోలీసులు గుర్తించారు. అలాగే అనధికార ప్రవేశాన్ని అనుమతించడమే థియేటర్‌ లోపల రద్దీ పెరగడానికి కారణమైంది. పోలీసుల తనిఖీలో ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. దీనిపై పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. సంధ్య థియేటర్‌ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here