డిసెంబరు 2న చిక్కడపల్లి పీఎస్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం బందోబస్తు కోసం దరఖాస్తు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4న పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్, నిర్మాతతో సహా మరికొంత మంది సంధ్య థియేటర్‌కు వస్తున్నారుని, బందోబస్తు కావాలని కోరారు. ఆ మరుసటి రోజే చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారన్నారు. సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయని, థియేటర్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉంది. సెలబ్రీటీలు వస్తే ఫ్యాన్స్ అదుపు చేయడం కష్టం అవుతుందని, సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. హీరో, హీరోయిన్, నిర్మాత ఎవరైనా థియేటర్‌కు రావడానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు తెలిపారన్నారు. థియేటర్ పెట్టుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప-2 ప్రీమియర్ షో రోజున హీరో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారన్నారు.