అలాగే క్రిస్మస్ పండుగకు కూడా క్రిస్మస్ చెట్లను ఇళ్లలో నాటడం మొదలుపెట్టారు. రంగురంగుల బొమ్మలు, గంటలు, టాఫీలు, రిబ్బన్లు, లైట్లతో అలంకరిస్తారు. నమ్మకాల ప్రకారం, 16 వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ సంస్కర్త మార్టిన్ లూథర్ క్రిస్మస్ చెట్టును అలంకరించడం ప్రారంభించాడని చెప్పుకుంటారు. ఒక కథనం ప్రకారం మార్టిన్ లూథర్ డిసెంబర్ 24 సాయంత్రం అడవి గుండా అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. అది మంచుతో కప్పిన అడవి. మార్టిన్ లూథర్ అడవిలో ఒక సతత హరిత వృక్షాన్ని చూశాడు. వెన్నెల దాని కొమ్మల మీద పడుతోంది. ఆ చెట్టును వేళ్లతో సహా పెకిలించి తెచ్చి తన ఇంట్లోని పెద్ద కుండీల్లో పాతాడు. ఆ చెట్టును క్రిస్ మస్ సందర్భంగా అలంకరించారు. అది చూసిన చుట్టు పక్కల వారికి ఆ చెట్టు ఎంతో నచ్చింది. వారు కూడా అలాగే చేయడం ప్రారంభించారు. అది కొన్నేళ్లకు సంప్రదాయంగా మారిపోయింది. యేసుక్రీస్తు జన్మదినం రోజూ పచ్చని చెట్టును అలంకరించడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది.