తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం మరింత బలపడిందని, సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. నైరుతి వైపుగా కదులుతున్న అల్పపీడనం..రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ఎఫెక్ట్ తో నేడు, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణలో వాతావరణం ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది.