గత ఇరవై రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. అది ప్రజల సమస్య కాకపోయినా, జరిగిన ఘటనలో ఓ సాధారణ మహిళ మృతి చెందడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై జనం ఎంతో ఆసక్తి చూపించారు. మీడియా అత్యుత్సాహం కూడా దీనిపై విపరీతమైన ఆసక్తి పెరగడానికి కారణమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని సమస్యను అల్లు అర్జున్‌ వర్సెస్‌ రేవంత్‌రెడ్డిగా మలిచారు కొందరు. మిగతా వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడిందంటూ ప్రచారం హోరెత్తించారు. ఈ విషయంలో ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క మంచు మోహన్‌బాబు వ్యవహారం క్రిటికల్‌గా మారిపోయింది. మీడియా రిపోర్టర్‌పై దాడి చేసిన కేసులో పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో అతని అరెస్ట్‌ అనివార్యమైంది. అయితే పోలీసుల అందుబాటులో లేకుండా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని కూడా మీడియా బాగా హైలైట్‌ చేస్తోంది. 

మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, దాడులు, అరెస్టులు వంటివి చాలా జరిగాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన టాలీవుడ్‌ ఇలాంటి వివాదాలతో, ఆరోపణలతో అప్రతిష్ట పాలవుతోంది. మరో పక్క అల్లు అర్జున్‌ను రేవంత్‌రెడ్డి కావాలనే టెన్షన్‌ పెడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇకపై స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్ల హైక్‌ ఉండదని, బెనిఫిట్‌ షోలకు కూడా అనుమతులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో టాలీవుడ్‌ షాక్‌కి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉంటే పరిస్థితి ఇంకా దిగజారుతుందని, కాబట్టి పరిశ్రమను ఆంద్రప్రదేశ్‌కి షిఫ్ట్‌ చెయ్యాలని సినీ పెద్దలు ఆలోచిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చిత్ర పరిశ్రమ భేటి అంటూ ఓ ప్రకటన చేశాడు ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌రాజు. గురువారం ఉదయం 10 గంటలకు 36 మందితో కూడిన సినీ ప్రముఖుల బృందం రేవంత్‌రెడ్డిని కలిసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్‌ వ్యహారం, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు.. ఇలా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తారని అందరూ భావించారు. ఆ మీటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఆ మీటింగ్‌ సారాంశాన్ని దిల్‌రాజు వివరించిన తర్వాత అందరికీ చాలా సందేహాలు వస్తున్నాయి. మీటింగ్‌లో వాళ్ళు మాట్లాడిన అంశాల గురించే మీడియాకి చెబుతున్నారా? లేక అసలు విషయాలు దాచిపెట్టి కొసరు మాటలే బయటికి వదిలారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

అసలు సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లింది దేనికి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వెలుగు చూసిన పలు వివాదాల గురించి, సంధ్య థియేటర్‌ దుర్ఘటన గురించి, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, దిల్‌ రాజు బయటికి వచ్చిన తర్వాత మీడియాకు చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తెలుగు సినిమా రేంజ్‌ పెంచడమే రేవంత్‌రెడ్డి ధ్యేయమని చెప్పారు దిల్‌రాజు. కొన్నేళ్ళ క్రితమే బాహుబలి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ను కూడా సాధించి తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించింది. పుష్ప2 కూడా ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో రిలీజ్‌ అయి రికార్డు స్థాయి కలెక్షన్స్‌ సాధించి బాహుబలి రికార్డును కూడా క్రాస్‌ చేసింది. ఇలా ఇండియాలోనే నెంబర్‌వన్‌ చిత్ర పరిశ్రమగా టాలీవుడ్‌ పేరు ఆల్రెడీ తెచ్చుకుంది. ఇంకా రాబోయే కొన్ని సినిమాలతో ఆ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. 

దిల్‌ రాజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎదురైన బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు ప్రశ్నను అసలు లెక్కలోకి తీసుకోకుండా.. అది చాలా చిన్న విషయమని, సినిమాలో అది ఒక పార్ట్‌ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా తెలుగు సినిమా స్థాయిని పెంచడంపైనే ఉందని చెప్పారు. కొన్ని సామాజిక అంశాల ప్రచారంలో టాలీవుడ్‌ తారలు పాల్గొనాలని ముఖ్యమంత్రి అడిగారని, దానికి చిత్ర పరిశ్రమ ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ విషయాలు చర్చించేందుకు అంత అత్యవసరంగా మీటింగ్‌ ఏర్పాటు చేయడాన్ని జనం నమ్మడం లేదు. దిల్‌రాజు మాట్లాడిన మాటల్లో ఒక్కసారి కూడా సంధ్య థియేటర్‌ ఘటన గురించి ప్రస్తావించలేదు. టాలీవుడ్‌లో పరంపరగా వస్తున్న వివాదాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ పరిష్కారం కాకుండా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తామని, హాలీవుడ్‌ సినిమాల షూటింగ్స్‌ కూడా ఇక్కడ జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్యలను గాలికి వదిలేసి.. ఇలా గాలిలో మేడలు కట్టడం మానుకోవాలని, ఆ సమస్యల్ని పరిష్కరిస్తే అద్భుతాలు చేసేందుకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలి. ఇప్పటికే తెలుగు సినిమాలు హాలీవుడ్‌ డైరెక్టర్లను సైతం మెప్పించే స్థాయిలో ఉంటున్నాయి. మన సినిమాల రేంజ్‌ను ఇంకా పెంచేందుకు మీరంతా కంకణాలు కట్టుకోవాల్సిన అవసరం లేదని గుర్తిస్తే మంచిది అంటున్నారు ప్రేక్షకులు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here