గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన రామ్‌చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం ఘనవిజయాన్ని కాంక్షిస్తూ 256 అడుగుల ఎత్తులో దేశంలోనే అతి పెద్ద కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మెగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ యూనిట్‌ హాజరు కాబోతోంది. ఈ కటౌట్‌కి సంబంధించిన పనులు ఐదు రోజులుగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కి రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు అభిమానులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. దీని కోసం పోలీసుల నుంచి అన్నిరకాల అనుమతులు తీసుకున్నట్టు అభిమానులు చెబుతున్నారు. ఆవిష్కరణలో భాగంగా హెలికాప్టర్‌ ద్వారా కటౌట్‌పై పూల వర్షం కురిపించనున్నారు. దాని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మైదానంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here