సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘‘ప్రేమచరిత్ర – కృష్ణ విజయం’’ ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దర్శకనిర్మాత మధుసూదన్‌ హవల్దార్‌ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలో నాగబాబు, అలి వంటి పలువురు ప్రముఖులు నటించారు. యశ్వంత్‌ – సుహాసిని హీరోహీరోయిన్లు. ‘ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం’ విడుదలను పురస్కరించుకుని దర్శకనిర్మాత మధుసూదన్‌ హవల్దార్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు!!

మూడే మూడు పాత్రలతో… నాగబాబు – చంద్రమోహన్‌ – బాలదిత్య నటించిన ‘వంశం’ దర్శకుడిగా నా తొలిచిత్రం. రివార్డులతోపాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిత్రమిది. ‘వంశం’ తర్వాత… తెలుగు – కన్నడ భాషల్లో రూపొందిన ‘అమెరికా – అమెరికా, నంబర్‌వన్‌ హీరో’ చిత్రాల తెలుగు వెర్షన్స్‌కు నేను దర్శకత్వం వహించాను. ఈ రెండు చిత్రాలు కూడా దర్శకుడిగా నాకు సంతృప్తిని, పేరును తెచ్చిపెట్టాయి. నా నాలుగో చిత్రం ‘ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం’. సూపర్‌ స్టార్‌ కృష్ణగారిని ఈ చిత్రం కోసం డైరెక్ట్‌ చేయడం దర్శకుడిగా నా జీవితంలో ఒక సువర్ణాధ్యాయం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ చిత్రం విడుదలలో అసాధారణ జాప్యం జరిగింది. ఆ తర్వాత కన్నడలో నేను దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బిజీ అయిపోయాను. అయితే, కృష్ణగారు లాంటి ఒక లెజెండ్‌ నటించిన సినిమా రిలీజవ్వకుండా ఆగిపోవడం నాకు మనస్కరించలేదు. అందుకే… ఈ చిత్రానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అద్ది ఫస్ట్‌ కాపీ సిద్ధం చేశాం. బిజినెస్‌ పరంగా కూడా కొంత క్రేజ్‌ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటకతోపాటు ఇంకా అనేక చోట్ల ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. కృష్ణగారి అభిమానులంతా కచ్చితంగా చూస్తారని నా నమ్మకం!!

కన్నడలో ఇప్పటివరకు నేను ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ‘‘ఆమర్మ, డిసెంబర్‌ 16, శ్రీ దాసరు, శ్రీ జగన్నాధ దాసరు, శ్రీ ప్రసన్న వెంకట దాసరు, శ్రీ విజయ దాసరు’’ అనే ఈ చిత్రాలు నాకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఓ అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. నేను స్వతహా సంగీత దర్శకుడ్ని కూడా. నా సినిమాలకు మాత్రమే కాకుండా వేరే సినిమాలకు కూడా మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేస్తుంటాను. తెలుగు – కన్నడ భాషల్లో ‘‘నా కూతురు లవ్‌ స్టొరీ’’ పేరుతో ఒక భావోద్వేగ భరిత ఇంటెన్స్‌ లవ్‌ స్టొరీ తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాను!!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here