డిసెంబర్‌ 4న పుష్ప2 ప్రీమియర్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ను ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధిస్తూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి సంతకం చెయ్యాల్సి ఉంది. అందులో భాగంగా ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లారు బన్నీ. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ బయట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి వెళ్లి సంతకం పెట్టి పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. 

ఇదిలా ఉంటే.. కిమ్స్‌ హాస్పిటల్‌ పరిధికి చెందిన రాంగోపాల్‌పేట పోలీసులు మరోసారి అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావద్దని ఆ నోటీస్‌లోని సారాంశం. రోగుల వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూడడం కోసమే బన్నీని రావొద్దని చెప్తూ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ బన్నీ రావాలని అనుకుంటే పోలీసుల సూచనలు పాటించాలని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి అతనే పూర్తి బాధ్యత వహించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. వాస్తవానికి ఆదివారం శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లాలని అల్లు అర్జున్‌ డిసైడ్‌ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అతనికి నోటీసులు జారీ చేశారు. దీంతో హాస్పిటల్‌కి వెళ్ళేందుకు సిద్ధమైన బన్నీ పోలీసుల నుంచి నోటీసు రావడంతో తన విజిట్‌ను రద్దు చేసుకున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here