(జనవరి 6 సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా..)
భారతీయ సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్. అంతేకాదు, భారతదేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించి దేశ ప్రతిష్టను మరింత పెంచిన మ్యూజిక్ డైరెక్టర్. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేసిన లివింగ్ లెజెండ్. ఇండియన్ మ్యూజిక్ ప్రపంచంలో సంచలనాలకు సెంటర్ పాయింట్. అతను కంపోజ్ చేసిన ప్రతి పాటా ప్రత్యేకమే. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు.. హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా కంపోజ్ చేసి చిందులేయించగలరు. ఇండియాలో మ్యూజిక్ అంటే రెహమాన్ అనేంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కీబోర్డ్ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ‘రోజా’ చిత్రంతో సంగీత దర్శకుడుగా ప్రపంచానికి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డును అందుకున్నారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న రెహమాన్ ఈ స్థాయికి రావడం వెనుక చేసిన కృషి, పడిన కష్టాలు ఏమిటి అనే విషయాలు అతని బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1967 జనవరి 6న ఆర్.కె.శేఖర్, కస్తూరి దంపతులకు జన్మించారు ఎ.ఆర్.రెహమాన్. అతనికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. రెహమాన్ అసలు పేరు ఎ.ఎస్.దిలీప్‌కుమార్. తండ్రి ఆర్.కె.శేఖర్ కూడా సంగీత దర్శకుడే. ఆయన 52 సినిమాలకు సంగీతాన్ని అందించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతూనే సంగీత వాయిద్యాలను అద్దెకు ఇచ్చేవారు. రెహమాన్ ఐదేళ్ళ వయసులోనే తండ్రి దగ్గర హార్మోనియం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అతను తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్ బారిన పడి మరణించారు. తల్లి కస్తూరి వాయిద్యాలను అద్దెకు ఇస్తూ కుటుంబాన్ని పోషించేవారు. రెహమాన్ స్కూల్‌కి వెళుతూనే సంగీతం కూడా నేర్చుకునేవారు. ఈ రెండూ చేయడం కష్టంగా మారడంతో.. సంగీతాన్నే కొనసాగించమని తల్లి సలహా ఇచ్చారు. సంగీత విద్వాంసుడు దక్షిణామూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు రెహమాన్. పదేళ్ళ వయసులో ఆర్.కె.శేఖర్ మిత్రుడు ఎం.కె.అర్జునన్ ఒక మలయాళ సినిమాలో రెహమాన్‌కు కీబోర్డ్ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చారు. అలా కీ బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. రమేష్‌నాయుడు, రాజ్, కోటి, ఇళయరాజాల వద్ద చాలా సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేశారు.
కీ బోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తూనే చిన్నప్పటి ఫ్రెండ్స్ శివమణి, జాన్ ఆంథోని, సురేశ్ పీటర్స్, జొజొ, రాజాలతో కలిసి రూట్స్ అనే రాక్ బ్యాండ్స్ గ్రూప్‌ని ఫామ్ చేసారు రెహమాన్. నెమెసిస్ అవెన్యూ అనే చెన్నయ్ బేస్డ్ రాక్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసారు. ఈ బ్యాండ్స్ ద్వారా ఎన్నో స్టేజ్ షోలు చేశారు. ఆ తర్వాత యాడ్స్‌కి జింగిల్స్ చేయడం ప్రారంభించారు రెహమాన్. దాదాపు 300 బ్రాండ్లకు జింగిల్స్ చేశారు. అతని గురించి తెలుసుకున్న మణిరత్నం తమిళ్‌లో రూపొందిస్తున్న ‘తిరుడా తిరుడా’ చిత్రం కోసం ట్యూన్స్ చేయించారు. అయితే ఆ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా టైమ్ ఉండడంతో కె.బాలచందర్ ఓ సినిమా చేయమని మణిరత్నంని కోరారు. అలా ‘రోజా’ చిత్రం ప్రారంభమైంది. ఆ సినిమా ద్వారా రెహమాన్‌ను సంగీత దర్శకుడుగా పరిచయం చేశారు. తొలి సినిమాతోనే తనేమిటో నిరూపించుకొని సినీ సంగీత ప్రియులకు కొత్త తరహా పాటలను పరిచయం చేశారు రెహమాన్. ఎవరూ వినని ప్రత్యేక శైలిలో పాటలు కంపోజ్ చేయడం రెహమాన్ ప్రత్యేకత. శ్రోతలను సున్నితంగా తాకే మధురమైన బాణీలతో చాలా తక్కువ సమయంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. మూడు దశాబ్దాలుగా తన సంగీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఏ భారతీయ సంగీత దర్శకుడూ చేరుకోలేని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
రెహమాన్ మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు. కీబోర్డ్, పియానో, సింథసైజర్, హార్మోనియమ్, గిటార్.. వంటి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్లు ప్లే చేయడంలో రెహమాన్ మాస్టర్ అని చెప్పాలి. సింథసైజర్ అంటే అతనికి క్యూరియాసిటీ ఎక్కువ. ఎందుకంటే.. అది మ్యూజిక్, టెక్నాలజీల కాంబినేషన్ అని రెహమాన్ చెబుతారు. మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు మంచి సింగర్ కూడా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో సినిమాలకు పాటలు రాసి.. అద్భుతంగా పాడారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కంపోజ్ చేసారు. రెహమాన్. కర్ణాటక సంగీతాన్ని, ఖవ్వాలీ స్టయిల్‌ను, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, వెస్టర్న్ మ్యూజిక్‌లను పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఇండియన్ స్టైల్‌లో బాణీలు కట్టడడంలో రెహమాన్ సిద్ధహస్తుడు.
వందేళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమకు.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఒక కల. ఆ లోటును రెహమాన్ తీర్చారు. రెహమాన్ మ్యూజిక్ అందించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జయహో’ పాటకు ఆస్కార్ అవార్డులతోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. టైమ్ మ్యాగజైన్ రెహమాన్‌కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత రెహమాన్‌కే దక్కుతుంది. ఆస్కార్ అవార్డులు అందుకున్న తర్వాత.. ఆ విజయం వంద కోట్ల భారతీయులదని చెప్పి దేశాభిమానాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తిత్వం అతని సొంతం. రెహమాన్ మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. తనలో దేశభక్తి కూడా ఎక్కువగానే ఉందని వందేమాతరం గీతం ద్వారా నిరూపించుకున్నారు రెహమాన్. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతరం ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు రెహమాన్. ఈ ఆల్బమ్‌లోని వందేమాతరం పాటకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. ఆల్‌టైమ్ లాంగెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
ఇండియన్ సినిమాలకే కాకుండా దాదాపు 10 హాలీవుడ్ మూవీస్‌కి సంగీతాన్ని అందించారు రెహమాన్. ఇక తన ఆర్కెస్ట్రాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కచ్చేరీలు చేశారు. లెక్కకు మించిన మ్యూజిక్ వీడియోలు చేశారు. సంగీత దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన టాలెంట్‌ను చూపించారు. ‘లే మస్క్’ పేరుతో ఓ వర్చువల్ రియాలిటీ థ్రిల్లర్‌ను రూపొందించారు.
జాతీయ స్థాయిలో ఏడు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, హిందీ, తమిళ చిత్రాలకు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’, ‘పద్మభాషణ్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. వివిధ సంస్థల నుంచి అందుకున అవార్డులకు లెక్కే లేదు.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. 1995లో సైరాబానుని వివాహం చేసుకున్నారు రెహమాన్. వీరికి ముగ్గురు సంతానం. వారిలో ఖతీజా, అమీన్ కూడా సింగర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రెహమాన్ అక్క కుమారుడు జి.వి.ప్రకాష్‌కుమార్ కూడా ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 2024 సెప్టెంబర్‌లో తమ 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు రెహమాన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.