పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు తెలుగు నాట ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాల స్పీడ్ తగ్గింది. పైగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా కావడంతో.. కొత్త సినిమాలు అంగీకరించడం మాట అటుంచితే, గతంలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుంది. దీంతో పవన్ అభిమానులు కూడా, గతంలో అంగీకరించిన సినిమాలు విడుదలైనా చాలని ఎదురుచూస్తున్నారు. అలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలోని సినిమాల్లో, విడుదలకు ముందు వరుసలో ఉన్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మార్చి 28న విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర బృందం తీరు చూస్తుంటే అసలు ఈ సినిమా మార్చి 28న విడుదలవుతుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ అభిమానులు సైతం మూవీ టీం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. (Hari Hara Veera Mallu)

 

నిజానికి ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా విడుదలై కూడా రెండు మూడేళ్లు అయిపోయేది. కానీ కోవిడ్ పాండమిక్, పవన్ పాలిటిక్స్ తో పాటు.. ఏవో ఇతర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమాని 2025, మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. విజయవాడ సమీపంలో వేసిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా, అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మళ్ళీ ‘హరి హర వీరమల్లు’ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

‘హరి హర వీరమల్లు’ నుంచి మొదటి సాంగ్ ని విడుదల చేస్తామని రెండు మూడు నెలలుగా ఊరిస్తున్నారు నిర్మాతలు. త్వరలో ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు, గతేడాది దసరా సందర్భంగా అక్టోబర్ లో ప్రకటించారు. కానీ రెండు నెలలు దాటిపోయినా ఆ సాంగ్ విడుదల కాలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ సింగల్ ని జనవరి 6న విడుదల చేయనున్నట్లు మళ్ళీ ప్రకటించారు. “మాట వినాలి” అంటూ సాగే ఈ పాటని స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడంతో.. దీని కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ చివరి నిమిషంలో, అనుకోని కారణాల వల్ల ఈ సాంగ్ ని విడుదల చేయలేకపోతున్నామని.. చావు కబురు చల్లగా చెప్పారు మేకర్స్. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ‘హరి హర వీరమల్లు’ టీంపై విరుచుకుపడుతున్నారు. ఒక సాంగ్ ని విడుదల చేయడానికే ఇన్ని వాయిదాలు వేస్తున్నారు. ఈ లెక్కన అసలు సినిమా మార్చి 28న విడుదలవుతుందా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here