వైకుంఠ దర్శనానికి వచ్చి వైకుంఠం వెళ్లిపోయారు..
తొలిసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం తాటిచెట్ల పాలెంకు చెందిన లావణ్య స్వాతి, కంచరపాలెంకు చెందిన శాంతి, మద్దెలపాలెంకు చెందిన రజనిలు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వారంతా బుధవారం ఉదయం నుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గేట్లను తెరిచిన సమయంలో తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందిన మహిళలకు చిన్న పిల్లలు ఉన్నారని, వారికి ఏమని చెప్పాలని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రుయా మార్చురీ వద్ద బంధువుల రోదనలతో హృదయవిదారంగా ఉంది.