ఒక స్టార్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్ని వందల మంది కృషి చెయ్యాల్సి ఉంటుంది. అందరి కంటే ఎక్కువగా హీరో శ్రమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దర్శకుడు తనకు సంతృప్తికరంగా ఔట్‌పుట్ రావడం కోసం కష్టపడతారు. అన్నింటినీ మించి నిర్మాత కొన్ని వందల కోట్ల రూపాయలను సినిమా కోసం వెచ్చించి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అలా విడుదలైన సినిమా మొదటిరోజు మార్నింగ్ షో సమయానికే ఇంటర్నెట్‌లో దర్శనమిస్తే ఆ సినిమా యూనిట్ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి అదేనని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన రోజు సాయంత్రం లేదా రాత్రికి నెట్‌లో దర్శనమివ్వడం ఇప్పటివరకు చూశాం. కానీ, గేమ్ ఛేంజర్ మాత్రం మార్నింగ్ షో వేసే సమయానికే నెట్‌లో హిందీ వెర్షన్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా లాంగ్వేజెస్ ప్రింట్లు కూడా అందుబాటులోకి వచ్చాయట.
‘గేమ్ ఛేంజర్’ పైరసీ ప్రింట్ లీక్ వెనుక 45 సభ్యుల ముఠా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాతలతోపాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా ఆ ముఠా సభ్యులు బెదిరించారని తెలుస్తోంది. వారు డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వకపోతే పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలోని కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హోచ్‌డి ప్రింట్ లీక్ చేయడమే కాదు… టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.
చిత్ర యూనిట్‌ని బెదిరించి, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆ ముఠా సభ్యులు సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని, ప్రింట్ లీక్ చేశారని చిత్ర యూనిట్ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాన్ని చిత్ర యూనిట్ వెలిబుచ్చుతోందని సమాచారం. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు సమగ్ర విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.