వయసు పెరుగుతున్న కొద్దీ తన స్పీడును పెంచుకుంటూ వెళ్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇప్పుడు మరో విధ్వంసానికి సిద్ధమవుతున్నారు. వరస పరాజయాల నుంచి జైలర్ వంటి భారీ విజయంతో బయట పడిన రజినీ ఆ సినిమాతో తన స్టామినా చూపించారు. ఇప్పుడు జైలర్2తో మరో ధమాకా ఇవ్వబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సంచలన విజయం తర్వాత దానికి సీక్వెల్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. సంక్రాంతి కానుకగా దానికి సంబంధించిన ఎనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఒక శాంపుల్‌గా టీజర్‌ని డిజైన్ చేశారు. రొటీన్‌కి భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌తో ఈ టీజర్‌ను రూపొందించారు.
ఈ టీజర్ ప్రారంభంలోనే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కనిపిస్తారు. వైజాగ్‌లో తుఫాన్ ఉన్న కారణంగా స్టోరీ డిస్కషన్ కోసం గోవా వస్తారు. దాని గురించే మాట్లాడుకుంటున్న సమయంలో జైలర్ తన విధ్వంసం ఎలా ఉండబోతోంది అని చెప్పే ఓ వయొలెంట్ యాక్షన్ సీన్ వారిని షాక్‌కి గురి చేస్తుంది. జైలర్ 2 కోసం వేరే ఆలోచన ఎందుకు అదే చేసేస్తే బాగుంటుంది కదా అని నెల్సన్, అనిరుధ్ అనుకుంటారు. జైలర్2 చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయనేది టీజర్లో అర్థమవుతోంది. జైలర్ చిత్రం ఘనవిజయంలో రజినీ పెర్ఫార్మెన్స్, నెల్సన్ టేకింగ్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్ర పోషించాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సీక్వెల్లోనూ దాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది.
జైలర్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. సీక్వెల్లో వాళ్ళు కనిపిస్తారా లేక వేరే స్టార్స్‌ని రంగంలోకి దించుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, వినాయకన్, సునీల్, తమన్నా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. సీక్వెల్లోనూ వీరు కంటిన్యూ అవుతున్నారు. ఘన విజయం సాధించి కలెక్షన్ల ఊచకోత కోసిన జైలర్ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.