Mark Zuckerberg: ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ తదితర సోషల్ మీడియా సంస్థల యాజమాన్య సంస్థ మెటా కు సీఈఓ గా వ్యవహరిస్తున్న మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో 2024 ఎన్నికలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారిని సరిగ్గా హ్యాండిల్ చేయని దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు 2024 లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా, భారత్ తదితర దేశాలను ఆయన ఉదహరించారు. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది.
అజ్ఞాన కామెంట్స్
కోవిడ్ -19 మహమ్మారి విజృంభించిన సమయంలో ఆ మహమ్మారిని సరిగ్గా నియంత్రించలేని ప్రభుత్వాలు 2024 లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాయని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అలా ఓడిపోయిన వాటిలో అమెరికా, భారత్ తదితర దేశాల్లోని ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ లో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ విస్మరించారు.
కేంద్ర ప్రభుత్వ స్పందన
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) ప్రకటనకు సమన్లు జారీ చేస్తామని చెప్పారు. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
మెటా ఇండియా క్షమాపణలు
అయితే, తమ యజమాని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశంలోని ఆ సంస్థ విభాగం మెటా ఇండియా స్పందించింది. జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. ‘‘2024 ఎన్నికలలో అనేక అధికార పార్టీలు తిరిగి విజయం సాధించలేదనే మార్క్ జుకర్ బర్గ్ పరిశీలన అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ భారతదేశానికి కాదు” అని మెటా ఇండియా ఉపాధ్యక్షుడు శివనాథ్ తుక్రాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (social media) లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. అమెరికా బహుళజాతి సాంకేతిక సమ్మేళనానికి భారతదేశం చాలా ముఖ్యమైన దేశమని తుక్రాల్ అన్నారు. వినూత్న భవిష్యత్తుకు కేంద్ర బిందువుగా భారత్ నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.