సీనియర్ స్టార్ హీరోలు, ఈ తరం స్టార్స్ తో పోటీపడి సినిమాలు చేయడమే గొప్ప విషయం అంటే.. వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం అనేది ఇంకా గొప్ప విషయం. ప్రస్తుతం టాలీవుడ్ లో అంతటి టాప్ ఫామ్ లో ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, తాజాగా ఒక రేర్ ఫీట్ ని సాధించారు. (Nandamuri Balakrishna)

 

2021 ముందు వరకు ఓ వైపు హిట్స్ ని, మరోవైపు ఫ్లాప్స్ ని ఖాతాలో వేసుకుంటూ వచ్చిన బాలకృష్ణ.. 2021 నుంచి అపజయమెరుగకుండా వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘అఖండ’. కోవిడ్ పాండమిక్ సమయంలో, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా? అనే అనుమానాల నడుమ.. తక్కువ టికెట్ ధరలు, లో ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలైంది. అయినప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి బాలయ్య హవా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలకృష్ణ. ఈ సినిమా కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ తో ఘన విజయం సాధించింది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేశాడు బాలయ్య. ఈ మూవీ కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, ఆయనకు హ్యాట్రిక్ హిట్ ను అందించింది.

 

హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ, రీసెంట్ గా ‘డాకు మహారాజ్’తో థియేటర్లలో అడుగుపెట్టారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ‘డాకు మహారాజ్’ రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. బాలయ్య సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఇది వరుసగా నాలుగోసారి. సీనియర్ స్టార్స్ లో వేరే ఏ హీరో కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం వరుసగా నాలుగు 100 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్న ఏకైక సీనియర్ హీరో బాలయ్యనే. (Daaku Maharaaj)

 

ఇంకో విశేషం ఏంటంటే బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘అఖండ-2’ను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నాడు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే జరిగితే వరుసగా ఐదు సినిమాలతో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన సీనియర్ స్టార్ గా బాలకృష్ణ రికార్డు సృష్టిస్తాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here