బాలీవుడ్ మాత్రమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గురువారం తెల్లవారుజామున జరిగిన దాడి అందర్నీ కలవరపరుస్తోంది. ముంబైలోని ఆయన నివాసంలో ఒక దుండగుడు చోరీకి యత్నించాడు. ఆ దొంగను తన సిబ్బందితో కలిసి సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దొంగ, సైఫ్ ను కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో సైఫ్ ఒంటి మీద ఆరు చోట్ల గాయాలయ్యాయని సమాచారం. సైఫ్ ని వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు సర్జరీ చేశారు. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. ఆ అగంతుకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే సైఫ్ పై జరిగిన దాడి నిజంగా చోరీకి వచ్చిన దొంగ పనేనా? లేక చోరీ పేరుతో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు సైఫ్‌పై జరిగిన దాడిని పలువురు సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ‘సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిందనే వార్త విని తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.