ఇటీవల విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హిందుత్వం గురించి, తెలుగు సినిమాల్లో దాన్ని వక్రీకరించి చూపించడం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ అనంతశ్రీరామ్‌ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సినిమాల్లో బూతు పాటలు రాస్తూ, టీవీ షోలలో పిచ్చి గంతులు వేసే అనంత శ్రీరామ్ తెలుగు భాష గురించి, హిందుత్వం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ మరింత పెరగడంతో అనంతశ్రీరామ్ స్పందించారు.
‘గతంలో రచయితలకు అంత వాల్యూ ఉండేది కాదు. అవకాశం కోసం దర్శకుల్ని నిర్మాతలను కాకా పట్టాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రచయితకు మంచి గుర్తింపు రావడమే కాకుండా ఒక స్థాయి కూడా వచ్చింది. రచనా రంగం అంటే డబ్బు సంపాదించుకునేది కాదు. అందుకే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయరు. రచయితలంటే ప్రథమ శ్రేణి పౌరులు కాదు అనే ఆలోచనను వారి నుంచి తొలగించాలి. రచయితలంటే అంత చిన్న చూపు ఎందుకు? మేం చేతులు కట్టుకొని కూర్చోవాలా. అవసరమైతే గంతులేస్తాం తప్పేం ఉంది. ఒక షోకి జడ్జిగా వెళ్లినపుడు వారిలో ఉన్న భయం పోగొట్టడానికి అలా చేశాను.
సినిమా రంగం మీద ఉన్న వ్యామోహంతో నేను ఇక్కడికి రాలేదు. నా విద్యకు సరైన ఫలితం సినిమా రంగంలో లభిస్తుందనే వచ్చాను. ఒక పాట రాసి దాన్ని ప్రింట్ చేస్తే వచ్చే డబ్బు కంటే సినిమాలో పాట రాస్తే వచ్చే డబ్బు ఎక్కువ. అది నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. నేను రాసే పాట ఎక్కువ మందికి చేరుతుందనే సినిమా రంగాన్ని ఎంచుకున్నాను’ అంటూ సినిమా రచయితగా ఎందుకు వచ్చాడో వివరించే ప్రయత్నం చేశారు అనంత శ్రీరామ్. కానీ, అనంత శ్రీరామ్ ఇచ్చిన ఈ వివరణ నెటిజన్లకు సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే అతనిపై ట్రోలింగ్‌ని మాత్రం ఆపలేదు. మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటో?