రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను నిరాశపరిచింది. రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన ‘గేమ్ ఛేంజర్’.. ఇప్పటిదాకా రూ.100 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి, నష్టాల దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (Ram Charan)
‘గేమ్ ఛేంజర్’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేస్తానని రామ్ చరణ్ మాట ఇచ్చాడట. అంతేకాదు ఆ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటానని చరణ్ చెప్పినట్లు సమాచారం. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో షాక్ లో ఉన్న దిల్ రాజుకి.. ఓ వైపు తమ బ్యానర్ లో రూపొందిన మరో సినిమా ‘సంక్రాంతి వస్తున్నాం’ సంచలన వసూళ్లు సాధిస్తూ ఉత్సాహాన్ని ఇవ్వగా, మరోవైపు రామ్ చరణ్ తక్కువ రెమ్యూనరేషన్ తో సినిమా చేస్తానని చెప్పడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అంటున్నారు. ఈసారి ఫామ్ లో ఉన్న దర్శకుడితో, పక్కా ప్లానింగ్ తో రామ్ చరణ్ సినిమా చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట.