కొన్ని సినిమాలు ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోవు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకొని.. ఐదు, పదేళ్లకు విడుదలైనా ప్రేక్షకులు వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే నిర్మాతలు కూడా అలా విడుదలకు నోచుకోని సినిమాలపై ఆశలు వదులుకుంటారు. అయితే అలా అనుకోవడం తప్పని ఏకంగా 12 ఏళ్ళ తర్వాత విడుదలైన ‘మద గజ రాజ’ రుజువు చేసింది. (Madha Gaja Raja)

 

విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మద గజ రాజ’. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సంతానం కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్లకు అడ్డంకులన్నీ తొలిగిపోయి సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. 12 ఏళ్ళ నాటి సినిమా కావడంతో ‘మద గజ రాజ’పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం మంచి వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.45 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ, మరో రెండు మూడు రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్ లో చేరనుంది. దీంతో ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.

 

అయితే ‘మద గజ రాజ’ ఈ స్థాయి వసూళ్లు రాబట్టడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి తమిళ స్టార్ హీరోల సినిమాలు విడుదల కాలేదు. విడుదలైన ఇతర సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కూడా నిరాశపరిచింది. ఈ క్రమంలో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘మద గజ రాజ’ ఆడియన్స్  కి బెస్ట్ ఆప్షన్ గా మారింది. పదేళ్ల క్రితం ఇలాంటి ఎంటర్టైనర్స్ బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. పైగా పొంగల్ సీజన్ కూడా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ‘మద గజ రాజ’ వైపు మొగ్గు చూపారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో విశాల్ తీవ్ర అనారోగ్యంతో కనిపించాడు. ఇది కూడా ప్రేక్షకుల్లో కాస్త సింపతీని క్రియేట్ చేసి, సినిమా చూసేలా చేసింది. ఇంకో విశేషం ఏంటంటే, సంతానం హీరోగా బిజీ కాకముందు.. కమెడియన్ గా తన ప్రైమ్ టైంలో చేసిన ఇది. దాంతో వింటేజ్ సంతానం కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు సంతానం మళ్ళీ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారంటే.. వారు కామెడీ సినిమాల ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా పలు అంశాలు కలిసొచ్చి, ‘మద గజ రాజ’ బాక్సాఫీస్ దగ్గర సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది.

 

‘మద గజ రాజ’ ఇచ్చిన ధైర్యంతో ఇలా విడుదలకు నోచుకోకుండా ఉన్న ఇతర సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయంలో తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమైంది. దీంతో పలు సినిమాలు విడుదలకు నోచుకునే అవకాశముంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here