తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు వీరి కాంబినేషన్ లో ‘జాంబి రెడ్డి’ అనే చిత్రం వచ్చింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ ‘జాంబి రెడ్డి’ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Zombie Reddy Sequel)
‘జాంబి రెడ్డి-2’లో తేజ సజ్జా హీరోగా నటించనున్నాడు. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరించట్లేదు. కేవలం స్క్రిప్ట్ అందిస్తాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఒక బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
తేజ సజ్జా ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ వర్మ విషయానికొస్తే రచయితగా, దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘జై హనుమాన్’, ‘అధీర’ సినిమాలతో పాటు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ప్రశాంత్ చేతిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ‘జాంబి రెడ్డి’ సీక్వెల్ కి స్క్రిప్ట్ ను అందిస్తున్నాడు. ఇది తేజ-ప్రశాంత్ కాంబోలో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్. తేజ సజ్జా నటించిన ‘జాంబి రెడ్డి’, ‘హనుమాన్’ సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు, తేజ యాక్ట్ చేసిన ఓటీటీ మూవీ ‘అద్భుతం’కి ప్రశాంత్ కథ అందించాడు. మరి ఇప్పుడు ‘జాంబి రెడ్డి-2’తో ఈ ద్వయం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.