వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రామ్‌గోపాల్‌వర్మకు పెద్ద షాక్‌ ఇచ్చింది కోర్టు. ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇటీవలికాలంలో వర్మ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కోర్టులో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు వర్మకు ఆ కేసుల వల్లే  జైలు శిక్ష ఖరారైందని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇది మరో కేసు. దాదాపు ఏడేళ్ళ క్రితం ముంబైలోని అంథేరి కోర్టులో ఈ కేసు నమోదైంది. ఏడేళ్ళుగా కొనసాగుతున్న విచారణ ఇప్పుడు ఓ కొలిక్కి రావడంతో అంథేరి మెజిస్ట్రేట్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అసలు వర్మపై ముంబైలో నమోదైన కేసు వివరాల్లోకి వెళితే..

2018లో రామ్‌గోపాల్‌వర్మపై చెక్‌ బౌన్స్‌ కేసు నమోదైంది. మహేశ్‌ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు  పడుతూ వచ్చింది. ప్రతిసారీ వర్మకు కోర్టు నోటీసులు పంపిస్తూనే ఉన్నా.. ఒక్కసారి కూడా అతను కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. వర్మపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో మహేశ్‌ చంద్ర మిశ్రాకు రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారం చెల్లించలేని పక్షంలో 3 నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెలువరించింది. 

ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ ఇండియాలో గ్రేట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ, ఆ తర్వాత వరస పరాజయాలతో వెనుకబడిపోయారు. అయితే అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పలుమార్లు వార్తల్లోకి ఎక్కారు. తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చిన వర్మ ప్రస్తుతం సినిమాల ద్వారా కాకుండా సంచలన వ్యాఖ్యల ద్వారా పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఓ కొత్త సినిమాకి సంబంధించిన వర్క్‌ చేస్తున్నానని ప్రకటించారు వర్మ. ‘సిండికేట్‌’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ఇటీవలికాలంలో వర్మ చేసిన సినిమాలన్నీ వివాదాలతో కూడుకున్నవి కావడంతో ‘సిండికేట్‌’ కోసం ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here