నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ‘అతనొక్కడే’ తర్వాత ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమా ‘పటాస్’. 2015 జనవరి 23న విడుదలైన ఈ సినిమా, మంచి వసూళ్లతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ విడుదలై నేటికి పదేళ్లు. ‘పటాస్’ సినిమాకి మరో విశేషం కూడా ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. నేటితో ఆయన దర్శకుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. (Anil Ravipudi)
రచయితగా పలు సినిమాలకు పని చేసిన అనిల్ రావిపూడి ‘పటాస్’తో మెగా ఫోన్ పట్టాడు. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా, విడుదల తర్వాత విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ లుక్, సాంగ్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి దాని మీద కేర్ తీసుకొని.. ఫుల్ మీల్స్ లాంటి కమర్షియల్ ఫిల్మ్ ను అందించాడు రావిపూడి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక అనిల్ వెనుతిరిగి చూసుకోలేదు. ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్-2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎఫ్-3’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దిశగా దూసుకుపోతోంది.
ఇలా వరుసగా ఎనిమిది విజయాలను అందుకొని, టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకడిగా అనిల్ రావిపూడి నిలిచాడు. ప్రజెంట్ జనరేషన్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా రికార్డు సృష్టించాడు. భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాల ఈ ట్రెండ్ లో.. ఫ్యామిలీ టచ్ తో ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని రావిపూడి సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాయి. వరుసగా ఎనిమిది విజయాలను అందుకోవడమే కాకుండా, రావిపూడి డైరెక్ట్ చేసిన గత ఐదు సినిమాలు.. వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి, అలాగే యూఎస్ లో 1 మిలియన్ కి పైగా డాలర్స్ కలెక్ట్ చేశాయి. మొత్తానికి పటాస్ తో పటాస్ లాంటి డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయనున్నాడు. ఆ సినిమాతో వరుసగా తొమ్మిదవ హిట్ కొట్టి, ట్రిపుల్ హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.