తెలుగునాట నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటిదాకా ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు రాగా.. మూడు ఒక దానిని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు వీరి కలయికలో ‘అఖండ 2 – తాండవం’ రూపొందుతోంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబినేషన్, దానికితోడు ‘అఖండ’ సీక్వెల్ కావడంతో.. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (Akhanda 2)

 

‘అఖండ-2’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ‘అఖండ’లో బాలకృష్ణ సరసన నటించిన ప్రగ్యా జైస్వాల్.. సీక్వెల్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సడెన్ గా ‘అఖండ-2’లో సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారా? లేక ప్రగ్యా జైస్వాల్ స్థానంలో సంయుక్త మీనన్ ను తీసుకున్నారా? అనే స్పష్టత రావాల్సి ఉంది. అయితే ‘అఖండ’లో బాలయ్య భార్యగా ప్రగ్యా నటించడంతో, సీక్వెల్ లో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకునే అవకాశం దాదాపు ఉండదనే చెప్పాలి. ఈ లెక్కన మరో హీరోయిన్ పాత్ర కోసం సంయుక్తను రంగంలోకి దింపి ఉండొచ్చు. 

 

బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ‘అఖండ-2’ని నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here