భారతీయ భాషల్లో రామాయణ గాధపై ఎన్నో సినిమాలు రూపొందాయి. అయితే 31 ఏళ్ళ క్రితం జపాన్, ఇండియన్ టీమ్ కలిసి ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ పేరుతో ఓ యానిమేషన్ చిత్రాన్ని నిర్మించారు. 1997లో ఈ చిత్రం జపాన్‌లో విడుదలై అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడం ద్వారా అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ సమయంలో ఇండియాలో నెలకొన్ని ఉన్న రాజకీయ పరిణామాల కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. దాదాపు 31 సంవత్సరాల తర్వాత ఇండియాలో ఈ సినిమా విడుదలైంది. జపాన్‌కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి, ఇండియాకు చెందిన రామ్‌మోహన్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగీష్ భాషల్లో జనవరి 24న ఈ సినిమా విడుదలైంది. ఎన్నో రూపాల్లో మనం చూసిన రామయణాన్ని యానిమేషన్‌లో ఎలా చిత్రీకరించారు. ఈ సినిమా తీరుతెన్నులు ఏమిటి? అనే విషయాలను ఈ సమీక్షలో పరిశీలిద్దాం.
కథ:
వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాముడి పుట్టుక గురించి వాయిస్ ఓవర్‌లో చెప్పించి అతనికి 15 ఏళ్ళు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు తన యజ్ఞయాగాదులని తాటకి నుంచి కాపాడటానికి రామ లక్ష్మణులను పంపమని దశరథుడిని అడగడం నుంచి కథని మొదలుపెట్టారు. రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడడాన్ని చూపించారు. ఆ తర్వాత శివధనస్సు విరిచి సీతని పెళ్లి చేసుకుంటాడు రాముడు. రాముడికి పట్టాభిషేకం చేద్దామని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మంథర మాటలు విని కైకేయి దశరథుడిని వరాలు అడగడం, రాముడు తండ్రి మాటకు కట్టుబడి వనవాసానికి బయల్దేరడం వంటి విషయాలను తమదైన పద్ధతిలో తెరకెక్కించారు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్లిన తర్వాత దశరథుడు మరణించడం, రాముడ్ని వెతుక్కుంటూ భరతుడు కూడా అడవికి వెళ్ళడాన్ని కూడా యధాతథంగా చూపించారు. శూర్పణఖ ముక్కు, చెవులు లక్ష్మణుడు కోయడం నుంచి సీతను రావణాసురుడు అపహరించి లంకకు తీసుకెళ్లడం, వానర సేనతో కలిసి సముద్రాన్ని దాటి రావణుడ్ని సంహరించడం వరకు మనకు తెలిసిన రామాయణాన్నే చూపించారు. చివరికి రాముడి పట్టాభిషేక ఘట్టాన్ని, రాముడు అవతారాన్ని చాలించడం వంటి విషయాలను మళ్లీ వాయిస్ ఓవర్స్‌తో ముగించారు.
విశ్లేషణ:
రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు చదివినా, విన్నా భారతీయులకు తనివి తీరదు. అలాంటి రామాయణాన్ని మరోసారి యానిమేషన్‌లో చిత్రీకరించడం కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 31 ఏళ్ళ తర్వాత చూసే అదృష్టం భారతీయులకు దక్కింది. సినిమా అంతా యానిమేషన్‌లో ఉన్నప్పటికీ కథలోని ఎమోషన్ ఎక్కడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. తెలుగు డైలాగ్స్‌ను బాగా రాసుకున్నారు. పాటలు వరకు హిందీ వెర్షన్‌వి ఉంచేశారు. ఇప్పటి జనరేషన్‌లోని పిల్లలు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన యానిమేషన్‌లోనే రామాయణ గాధను చూపించడం వల్ల వారికి బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. తద్వారా ఈ గొప్ప ఇతిహాసం గురించి పూర్తిగా తెలుసుకుంటారు.
సాంకేతిక నిపుణులు:
జపాన్ వారు యానిమేషన్ చిత్రాలను ఎంత అద్భుతంగా తీస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను కూడా చక్కగా ప్లాన్ చేశారు. అప్పట్లోనే 450 మంది సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4కె హెచ్‌డి క్వాలిటీకి అనుగుణంగా సినిమాని తీర్చిదిద్దారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సిట్యుయేషన్ తగ్గట్టుగా చేశారు. అడవుల్లో వినిపించే సహజ సిద్ధమైన శబ్దాలను బాగా క్యాప్చర్ చేశారు.
ఫైనల్‌గా చెప్పాలంటే..:
కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా ఈ సినిమా సౌండ్‌గా ఉందని చెప్పొచ్చు. మనకు తెలిసిన రామాయణమే అయినప్పటికీ దాన్ని స్క్రీన్‌పై కొత్త ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి జనరేషన్‌కి రామాయణం గురించి అవగాహన కలిగించేందుకు తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు ఈ సినిమాని చూపిస్తే బాగుంటుంది. ఇండియా, జపాన్ టెక్నీషియన్స్ కలిసి ఒక అద్భుత కావ్యంగా ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ చిత్రాన్ని తెరకెక్కించడం ఈ సినిమాకి వున్న ప్రత్యేకత అని చెప్పొచ్చు.