వెబ్ సిరీస్: సివరపల్లి
నటీనటులు: మురళీధర్ గౌడ్, పావని కరణం, రాగ్ మయూర్, రూపాలక్ష్మీ, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె తదితరులు
ఎడిటింగ్: సాయి మురళి
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
మ్యూజిక్: సింజిత్ ఎర్రమిల్లి
నిర్మాతలు: విజయ్ కోశి, అరుణభ్ కుమార్, రవికిరణ్ మదినేడి
దర్శకత్వం: భాస్కర్ మౌర్య
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
హిందీలో వచ్చిన వెబ్ సిరీస్ లలో ‘పంచాయత్’ ఒకటి. దానికి అక్కడ విశేష స్పందన లభించింది. దానిని ఇప్పుడు తెలుగులో ‘సివరాపల్లి’ పేరుతో దర్శకుడు భాస్కర్ మౌర్య రిమేక్ చేశాడు. మురళీధర్ గౌడ్, పావని కరణం ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం.
కథ:
తెలంగాణాలోని ‘సివరపల్లి’ గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా శ్యామ్ (రాగ్ మయూర్)కి జాబ్ వస్తుంది. అయితే శ్యామ్ స్నేహితులంతా విదేశాలకి వెళ్ళి సెటిల్ అవుతుంటారు. శ్యామ్ కూడా విదేశాలకి వెళ్ళాలనుకుంటాడు కానీ వాళ్ళ నాన్న బలవంతం మీద సివరపల్లికి రావాల్సి వస్తుంది. ఆ ఊరికి సుశీల (రూప లక్ష్మి)సర్పంచ్ గా ఉండగా వ్యవహారాలన్నీ ఆమె భర్త సుధాకర్ ( మురళీధర్ గౌడ్) చూసుకుంటాడు. వారికి ‘అనూ’ అనే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంటుంది. ఇక పంచాయితీ ఆఫీసులోనే ఒక రూమ్ లో శ్యామ్ ఉంటాడు. అతనికి అసిస్టెంట్ గా నరేశ్ ఉంటాడు. శ్యామ్ కి విదేశాలకి వెళ్ళాలనే డ్రీమ్ ముందు ఆ ఊరి వాతావరణం, అక్కడి మనుషులు ప్రవర్తించే తీరు శ్యామ్ కి చిరాకు కలిగిస్తుంటాయి. సాధ్యమైనంత త్వరగా తను విదేశాలకి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూనే అందుకు సంబంధించిన బుక్స్ చదువుతుంటాడు. ఇదే సమయంలో అతనికి తన కూతురు ‘అనూ’ను ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన సర్పంచ్ కి వస్తుంది. విదేశాలకి వెళ్లాలనే శ్యామ్ ప్రయత్నం ఫలించిందా? సర్పంచ్ కూతురుతో అతని పెళ్లి అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది హిందీ సిరీస్ కి రీమేక్ అయినప్పటికి దర్శకుడు భాస్కర్ మౌర్య తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కంటెంట్ ను అందించిన తీరు ఆకట్టుకుంటుంది. తెలంగాణ నేపథ్యంలోని ఒక ఊరు, తెలంగాణ యాస, స్వభావాలను ప్రెజెంట్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి.
మొదటగా ఒక ఊళ్ళో పంచాయతీ ఎలా ఉంటుందో, సర్పంచ్, అక్కడ ఉండే ఉప సర్పంచ్ ఇలా అందరి గురించి చాలా స్పష్టంగా చూపించాడు దర్శకుడు. అయితే దీనికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయి. వాటిల్లో అన్నింటి నిడివి ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో సాగే సీన్లని చాలా సహజసిద్ధంగా తీసినప్పటికి క్షుణ్ణంగా వివరించే క్రమంలో కథనం స్లోగా సాగుతుంది. అయితే ఇదే పెద్ద మైనస్. ఎపిసోడ్ లు మారుతున్న కొద్దీ ల్యాగ్ ఎక్కువగా ఉందనే భావన ఆడియన్స్ కి వస్తుంది.
హిందీలో పంచాయత్ సిరీస్ చూసిన వారికి ఇది అంతకనచ్చకపోవచ్చు కానీ అది చూడనివారికి ఈ సిరీస్ నచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో
బాలిక విద్య, మూఢనమ్మకాలు, లింగ అసమానతలు, వ్యవస్థలోని అవినీతి మరియు గ్రామాల్లో పేదరికం ఇలా అనేక అంశాలను నెమ్మదిగా టచ్ చేశాడు దర్శకుడు. ఇది ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. పంచాయతీ సెక్రటరీ అంటే కూడా ఊర్లో ఎవరికి తెలియదు.. అలాంటి వారితో కొత్తగా వచ్చిన హీరో ఎలాంటి ఇబ్బందుల ఎదుర్కున్నాడో చక్కగా చూపించాడు దర్శకుడు. ఎక్కడ కూడా అడల్ట్ సీన్లు లేకుండా బూతులు వాడకుండా ఫ్యామిలీతో కలిసి చూసేలా దర్శకుడు ఈ సిరీస్ ని రూపొందించాడు. ఇది సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు.. ట్విస్ట్ లు లేవు కానీ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేలా ఈ సిరీస్ ని మేకర్స్ తీసుకొచ్చారు. వాసు పెండెం సినిమాటోగ్రఫీ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ బాగుంది. సాయి మురళి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
పంచాయితీ సెక్రటరీగా రాగ్ మయూర్, సర్పంచ్ గా మురళీధర్ గౌడ్, ఆయన భార్య పాత్రలో రూపలక్ష్మి, ఉప సర్పంచ్ గా ఉదయ్ గుర్రాల, పంచాయితీ సెక్రటరీకి అసిస్టెంట్ గా సన్నీ పల్లె తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతావారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : కుటుంబంతో కలసి చూసే సివరపల్లి. డోంట్ మిస్ ఇట్.
రేటింగ్: 2.75 /5
✍️. దాసరి మల్లేశ్