76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో సేలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. 50 ఏళ్ళ సినీ కెరీర్‌లో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక పాత్రల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నందమూరి బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డులు పొందిన వారిలో తమిళ్ హీరో అజిత్‌కుమార్, నటి శోభన కూడా ఉన్నారు. నటి శోభనకు 2006లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
‘మిత్రుడు నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే పద్మ అవార్డులకు ఎంపికైన ఇతర ప్రముఖులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి. ‘బాలా సర్‌కి, అజిత్ సర్‌కి నా శుభాకాంక్షలు. మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘పద్మభూషణ్ పురస్కారాన్ని పొందిన బాలయ్యబాబు గారికి శుభాకాంక్షలు’ అంటూ రవితేజ స్పందించారు. ‘పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించబడిన బాలకృష్ణగారికి అభినందనలు. సినిమా అంటే మీకు ఉన్న అభిరుచికి ఈ పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ట్వీట్ చేశారు.
‘సినిమా రంగానికి 5 దశాబ్దాలుగా సేవలందిస్తున్న నందమూరి బాలకృష్ణగారికి లభించిన ఈ గౌరవానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా మీరు చేసిన సేవలకు గానూ మీరు నిజంగా ఈ గౌరవానికి అర్హులు’ అని సాయిధరమ్‌తేజ్ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న బాలయ్యకు అభినందనలు!! సినిమా, ప్రజాసేవ పట్ల మీ అంకిత భావానికి తగిన గౌరవం దక్కిందని వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా రంగంతోపాటు ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అవార్డులు పొందినవారందరికీ నెటిజన్లు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.