జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు ఎందరో అభిమానులు ఉన్నారు. అనారోగ్యం కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానులు సైతం తమ చివరి కోరిక ఎన్టీఆర్ ను కలవడం అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానులను కొందరిని కలిశాడు ఎన్టీఆర్. తాజాగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక యువతి ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాలని ఆశ పడుతుంది.
తెలంగాణలోని హుజూరాబాద్ కి చెందిన స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడటం తన చివరి కోరిక. ఈ విషయాన్ని స్వాతి తల్లి రజిత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు కోమటిరెడ్డికి రజిత ఒక లేఖ రాశారు. “నా కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ పేషంట్. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాలనేది ఆమె చివరి కోరిక. కాబట్టి తమరు దయవుంచి ఎన్టీఆర్ ను కలిపించాల్సిందిగా కోరుతున్నాను.” అని రజిత లేఖలో పేర్కొన్నారు. మరి ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్లి, ఆయన స్వాతి చివరి కోరికను నెరవేరుస్తారేమో చూడాలి.