ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ కథ తమదనో లేక తమ సినిమాకి కాపీ అనో ఇతరులు ఆరోపించిన సందర్భాలు పలు ఉన్నాయి. కానీ ఒక సినిమా విడుదలై ఏడాది దాటిపోయిన తర్వాత.. అది మా సినిమాకి కాపీ అని ఆరోపించడం వింతగా ఉంటుంది. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ విషయంలో అదే జరిగింది. (Hi Nanna)

 

నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్ నాన్న’. 2023 డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. 2024 జనవరిలో నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి అడుగుపెట్టి పలు భాషల ప్రేక్షకులకు చేరువై ఎంతో పేరు తెచ్చుకుంది. అలాంటి సినిమాపై ఏకంగా ఏడాది తర్వాత కాపీ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

 

 

‘హాయ్ నాన్న’ సినిమాని టార్గెట్ చేస్తూ తాజాగా కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. రీమేక్ రైట్స్ తీసుకోకుండా తాము నిర్మించిన ‘భీమసేన నలమహారాజా’ మూవీకి కాపీగా ‘హాయ్ నాన్న’ను రూపొందించారని ఆరోపించాడు. అంతేకాదు, ఇలా చేయడం ఎంత చీప్ అంటూ దారుణ వ్యాఖ్యలు చేస్తూ నానిని ట్యాగ్ చేశాడు. 

 

దీంతో ఇప్పుడీ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య తీరుని తప్పుబడుతున్నారు. ఇప్పటికే ‘భీమసేన నలమహారాజా’ సినిమాని చూసిన వారైతే.. అసలు దానికి, హాయ్ నాన్నకి ఏమైనా సంబంధం ఉందా? అని ఫైర్ అవుతున్నారు. ముందు నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా చూడు, నువ్వేదో వేరే సినిమా చూసినట్టు ఉన్నావని మండిపడుతున్నారు. ‘హాయ్ నాన్న’ విడుదలైన ఏడాదికి మేలుకున్నావా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో, ఒకవేళ కాపీ చేశారని నీకు అనిపిస్తే.. దర్శకనిర్మాతలను అడగాలి కానీ, హీరోని ట్యాగ్ చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై నాని కానీ, ‘హాయ్ నాన్న’ టీం కానీ స్పందిస్తారేమో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here