కశ్యపునికి అదితికి వివస్వంతుడు (సూర్యుడు) జన్మించెను. త్వష్ట ప్రజాపతి కూతురు సంజ్ఞ సూర్యుని భార్య. కశ్యపుడు వాత్సల్యముతో వీడు అండమందు మృతుడు కాలేదు కద! అని పలికినందున సూర్యునికి మార్తాండుడను పేరు కలిగెను. ఆయనకు సంజ్ఞయందు శ్రాద్ధదేవుడను మనువు, యముడు, యమున కలిగిరి, సంజ్ఞ సూర్యుని తేజస్సును సహింపక తన ఛాయను తన రూపు కలదానిగా కల్పించెను. ఆమె సంజ్ఞకు మ్రొక్కి నిలుచుండెను.