అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)’ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ సినీ, పారిశ్రామిక ప్రముఖులందరితోనూ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం చేశారు. ఈ మేరకు చిరంజీవి తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 

ప్రధాని మోదీ శుక్రవారం నాడు వేవ్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఇందులో చిరంజీవి, సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజినీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ కుమార్, రణ్ బీర్ కపూర్, దీపిక పదుకొణె వంటి వారు పాల్గొన్నారు.

 

ఆర్థిక రంగం కోసం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎలా జరుగుతుందో.. వినోద పరిశ్రమ కోసం అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా WAVES (వేవ్స్)ను రూపొందిస్తున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.

 

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఇంతటి మహోత్తరమైన కార్యక్రమంలో భాగం చేసిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. వేవ్స్ అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం, ఇతర గౌరవనీయమైన సభ్యులతో పాటుగా నా ఆలోచనల్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. శ్రీ మోదీ గారి మానస పుత్రిక అయిన వేవ్స్ భారతదేశాన్ని ప్రపంచ వేదికలపై సగర్వంగా చాటుకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలో జరగనున్న అద్భుతాల కోసం మనమంతా ఎదురచూస్తుండాలి” అని అన్నారు.

 

ఈ భేటీ మీద ప్రధాని మోదీ స్పందిస్తూ.. “వినోదం, సృజనాత్మకత, సంస్కృతి ప్రపంచాన్ని ఒకచోట చేర్చే ప్రపంచ శిఖరాగ్ర సదస్సు అయిన వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ విస్తృతమైన సమావేశం ఇప్పుడే ముగిసింది. అడ్వైజరీ బోర్డు సభ్యులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వారు తమ మద్దతును పునరుద్ఘాటించడమే కాకుండా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడానికి మా ప్రయత్నాలను ఎలా మరింత మెరుగుపరచాలనే దానిపై విలువైన సలహాలు, సూచనల్ని పంచుకున్నారు” అని అన్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here