దేశంలో మోసాలు రాజ్యమేలుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించే పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. అలా కొందరు సినిమా రంగాన్ని ఎంచుకుంటున్నారు. హీరోలు, హీరోయిన్లుగా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేసేవారిని ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయితే అలాంటి మోసాల వల్ల వేలల్లో, లక్షల్లో నష్టపోతుంటారు. కానీ, తాజాగా జరిగిన ఓ సినిమా మోసం వల్ల ఏకంగా 4 కోట్లు నష్టపోయింది ఓ యువతి. ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ కుమార్తె ఆరుషి నిషాంక్‌ ఈ మోసానికి బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. 

33 ఏళ్ళ ఆరుషి నటిగా, నిర్మాతగా ఉత్తరాఖండ్‌ ప్రేక్షకులకు సుపరిచితం. తన అభిరుచి మేరకు కొన్ని సినిమాలను నిర్మించారు. అప్పటివరకు హీరోయిన్‌గా నటించని ఆరుషికి కొందరు ఘరానా మోసగాళ్ళు తమ ఉచ్చులోకి లాగారు. 5 కోట్లు పెట్టుబడి పెడితే మంచి సినిమా తియ్యొచ్చని, దాన్ని 15 కోట్లకు అమ్ముతామని ఆరుషిని నమ్మించారు. వారిని  నమ్మి 5 కోట్లు చెల్లించింది. కథలో ఆమె క్యారెక్టర్‌ నచ్చకపోతే 15 శాతం వార్షిక వడ్డీతో అమౌంట్‌ మొత్తం చెల్లిస్తామని చెప్పారు. వారు చెప్పిన కథగానీ, తన క్యారెక్టర్‌గానీ ఆరుషికి నచ్చలేదు. దాంతో డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వారిని కోరింది. అయితే ఏదో సాకులు చెబుతూ జాప్యం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. డబ్బు అడిగితే చంపేస్తామని బెదిరించారు. చివరికి డెహ్రాడూన్‌లోని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు ఆరుషి. ముంబైకి చెందిన మానసి వరుణ్‌, వరుణ్‌ ప్రమోద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here