తక్కువ బడ్జెట్ చిత్రమా? కొత్త నటీనటులా? అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్‌తో ఫీల్‌గుడ్‌గా నిలిచే చిత్రాలు మంచి విజయాలను అందుకొంటున్నాయని తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయని ఆయన తెలిపారు. “తకిట తదిమి తందాన” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన చిత్రబృందాన్ని అభినందిస్తూ పైవిధంగా పేర్కొన్నారు.
“మర్డర్” మూవీలో హీరోగా నటించిన గణ ఆదిత్య, నూతన తెలుగు అమ్మాయి ప్రియ జంటగా యువ దర్శకుడు రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మాంగో ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన “తకిట తదిమి తందాన” చిత్ర ఫస్ట్ లుక్ ను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, సినీటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమోని, చిత్ర దర్శకుడు రాజ్ లోహిత్, నిర్మాత చందన్ కుమార్ కొప్పులతోబాటు, నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన తకిట తదిమి తందాన” చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత చందన్ కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆద్వర్యంలో విడుదల కానుంది. నరేన్ రెడ్డి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పి.ఎన్.అంజన్, ఎడిటర్ గా హరి శంకర్ వ్యవహరిస్తున్నారు.