సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఫిబ్రవరి 16న తుది శ్వాస విడిచారు. ఇటీవలే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సంలోకి అడుగు పెట్టిన ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం కన్నుమూశారు. సి.కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నారు.
1949లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో సి.కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’ చిత్రం ద్వారా మహానటుడు నందమూరి తారక రామారావును తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ఆమె మృతిపట్ల నందమూరి బాలకృష్ణ తన స్పందన తెలియజేస్తూ ‘రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుగారి నటజీవితానికి తొలుత అవకాశం అందించిన శ్రీమతి కృష్ణవేణిగారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందారు. ఆమె మరణం మమ్మల్ని ఎంతగానో బాధిస్తోంది. శ్రీమతి కృష్ణవేణిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. ‘మన దేశం’ లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి ఎన్నో సత్కారాలను అందుకున్నారు. ఇటీవల ఎన్. టి.ఆర్. వజ్రోత్సవంలోనూ, అంతకుముందు ఎన్.టి.ఆర్. సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణిగారిని ఘనంగా సత్కరించడం జరిగింది. కృష్ణవేణిగారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని అన్నారు.