ఇటీవలి కాలంలో టాలీవుడ్ ప్రముఖుల టైమ్ బాగున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఎవరు ఎలా మాట్లాడినా, ఏ ఉద్దేశంతో మాట్లాడినా అది కాంట్రవర్సీ అయిపోతోంది. కొన్ని సందర్భాల్లో వేదికపై ఎంతో సాధారణంగా మాట్లాడినా దాన్ని భూతద్దంలో చూసే కొన్ని మీడియా సంస్థలు దాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరికొందరు ప్రముఖులు కాంట్రవర్సీ అవుతుందని తెలిసినా కొన్ని కామెంట్స్ చేయడానికి వెనుకాడడం లేదు. ఏది ఏమైనా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగే కొన్ని ఈవెంట్స్‌లో ఆ సినిమా విశేషాల కంటే అక్కడికి వచ్చిన అతిథులు మాట్లాడే మాటలే వైరల్ అవుతున్నాయి. దాంతో ఆయా సినిమాలను ప్రమోట్ చేసుకునే అవకాశం మేకర్స్‌కి లభించడం లేదన్నది వాస్తవం. ఈమధ్యకాలంలో జరిగిన ప్రతి ఈవెంట్లో ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. మీడియా కూడా దాన్నే హైలైట్ చేస్తూ వస్తోంది.
ఇటీవలి కాలంలో చిరంజీవి, దిల్‌రాజు, అల్లు అరవింద్, సుకుమార్, పృథ్వీ.. ఇలా ఎంతో మంది సినిమాకి సంబంధం లేని విషయాలను ప్రస్తావించి వార్తల్లోకి ఎక్కారు, వివాదాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే ప్రముఖ నిర్మాత ఎస్కెన్ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ హీరోయిన్ విషయంలో అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి. అతను మాట్లాడిన మాటల్లో అక్కసు అనేది స్పష్టంగా కనిపించింది. ‘తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తర్వాత తెలిసింది. అందుకే నేను, నా డైరెక్టర్ సాయిరాజేష్ తెలుగు రాని పరభాషా హీరోయిన్లనే ఎంకరేజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాము’ అని వ్యాఖ్యానించాడు.
ప్రదీప్ రంగనాథన్, కాయదు లోహర్ జంటగా తమిళ్లో రూపొందిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రం తెలుగులో కూడా ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చిన ఎస్కెఎన్ పై వ్యాఖ్యలు చేశారు. 2023లో ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ‘బేబి’ చిత్రం ద్వారా వైష్ణవి చైతన్య అనే తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడంతో వైష్ణవికి అవకాశాలు బాగా వచ్చాయి. అంతకుముందు పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన వైష్ణవికి హీరోయిన్గా తొలి చిత్రం బేబి. వైష్ణవిని ఉద్దేశించే ఎస్కెఎన్ ఆ కామెంట్స్ చేశాడన్నది అందరికీ అర్థమైంది. ఆ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండతో చేసే మరో సినిమాలో ఆమెను హీరోయిన్గా అనుకొని, ఆమెను సంప్రదిస్తే వేరే ప్రాజెక్ట్స్ ఉన్న కారణంగా ఆ సినిమా చేసేందుకు వైష్ణవి అంగీకరించకపోవడాన్ని మనసులో పెట్టుకున్న ఎస్కెఎన్ ఈ తరహా కామెంట్స్ చేశాడని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఒక తెలుగమ్మాయి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంటే ఆ క్రెడిట్‌ను ఆ సినిమా దర్శకనిర్మాతలు తీసుకుంటారు. తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ప్రోత్సహించడం లేదు అని కామెంట్ చేసేవారికి తమ సినిమా ఉదాహరణ అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ, దానికి రివర్స్‌గా ఎస్కెఎన్ కామెంట్ చేయడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. తమకి సంబంధం లేని ఒక వేదికపై వైష్ణవి గురించి అలాంటి వ్యాఖ్యానాలు చేయడం సరికాదని నెటిజన్లు మండి పడుతున్నారు. నిర్మాత ఎస్‌కెఎన్‌కి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. అలా ఎన్నోసార్లు నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అనవసరమైన కామెంట్స్ చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కారు ఎస్కెఎన్.