ప్రేక్షకుడికి నిజమైన ఎంటర్ టైన్మెంట్ ని అందించే ఒకే ఒక్క సాధనం సినిమా(Cinema).ఈ విధంగా 100 సంవత్సరాలపై నుంచి ఎన్నో సినిమాలు సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెడుతు,ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి.నిత్యం ఎంతో మంది తమకి అందుబాటులో ఉన్న థియేటర్స్ కి వెళ్లి సినిమా ఇచ్చే మజాని ఆస్వాదిస్తుంటారు.ఈ కోవలోనే 2023 లో బెంగుళూరుకి చెందిన ఒక వ్యక్తి బుక్ మై షో యాప్ లో టికెట్ బుక్ చేసుకొని నాలుగు గంటల షో కి పివిఆర్ ఎనాక్స్(Pvr Inox)కి వెళ్ళాడు.
కానీ థియేటర్ యాజమాన్యం చెప్పిన సమయానికి షో వెయ్యలేదు.ఒక అరగంటసేపు వాణిజ్య ప్రకటనలతో పాటు,కొన్నిసినిమాల ట్రైలర్స్ ని ప్రదర్శించడం జరిగింది.ఫలితంగా అరగంట ఆలస్యంగా షో ముగిసింది.దీంతో షో అరగంట ఆలస్యంగా వెయ్యడం వల్ల తన 25 నిమిషాల విలువైన సమయం వృధా అయ్యిందని,ముందుగా ప్లాన్ చేసుకున్న కొన్నిషెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసుకోవలసి వచ్చిందంటు వినియోగదారుల ఫోరమ్ లో పీవీఆర్ ఎనాక్స్ పై కేసు నమోదు చేసాడు.
ఇప్పుడు ఈ విషయంపై వినియోగదారుల ఫోరమ్ తీర్పుని ప్రకటించింది.ప్రేక్షకుడి విలువైన సమయాన్ని డబ్బుగా పరిగణించి,నష్ట పరిహారం కింద ప్రేక్షకుడికి 65 వేలు చెల్లించాలని ఎనాక్స్ కి ఆదేశాలు జారీ చేసింది. లక్షజరిమానాని కూడా ఐనాక్స్ కి విధించిన ఫోరమ్,బుక్ మై షో యాప్ మాత్రం బుకింగ్ ప్లాట్ ఫార్మ్ కాబట్టి, స్ట్రీమింగ్ సమయంపై ఆ యాప్ కి సంబంధం ఉండదంటు తీర్పుని వెల్లడించింది.