‘హనుమాన్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రస్తుతం ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు.
‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో మిరాయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అదిరిపోయే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటీటీ డీల్ అంత తేలికగా లేదు. తమ సినిమాల ఓటీటీ రైట్స్ ను అమ్మడం కోసం పలువురు మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ‘మిరాయ్’ సినిమాకి మాత్రం అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.30 కోట్లకు దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్ధమైనట్లు వినికిడి.
ఒక యంగ్ హీరో సినిమాకి కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే రూ.30 కోట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. టీజర్, ట్రైలర్ మెప్పిస్తే.. థియేట్రికల్ బిజినెస్ పరంగానూ ఈ సినిమా రికార్డులు సృష్టించే అవకాశముంది.
‘మిరాయ్’ సినిమాని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ, అప్పటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేకపోవడంతో.. జూలై 4 కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.