సినిమాపేరు:రిటర్న్ఆఫ్ ది డ్రాగన్

నటీనటులు:ప్రదీప్ రంగనాథన్,అనుపమ పరమేశ్వరన్,కయదు లోహర్,గౌతమ్ వాసుదేవమీనన్,కేఎస్ రవికుమార్,జార్జ్ మర్యన్, మిస్కిన్ ,హర్షత్ ఖాన్ తదితరులు 

రచన,దర్శకత్వం:అశ్వత్ మారిముత్తు

సినిమాటోగ్రఫి: నికిత్ బొమ్మి 

ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్ 

సంగీతం:లియోన్ జేమ్స్ 

నిర్మాతలు:కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్  

బ్యానర్ : ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్    

రిలీజ్ డేట్: 21 -02 -2025 

‘లవ్ టుడే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ హీరో’ప్రదీప్ రంగనాథన్'(Pradeep ranganathan)ఈ రోజు ‘రిటర్న్ఆఫ్ ది డ్రాగన్'(Return off the dragon)అనే మరో మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాఘవన్(ప్రదీప్ రంగనాథన్) చిన్న వయసు నుంచే చదువులో మెరిట్ స్టూడెంట్.మంచి భవిష్యత్తు కోసం కలలు కంటు,తొంబై ఆరు పర్సెంటేజ్ మార్కులతో ఇంజనీరింగ్ లో చేరతాడు.కానీ చదువుని గాలికొదిలేసి ‘డ్రాగన్’ గా పేరు మార్చుకొని అల్లర చిల్లరగా తిరుగుతుంటాడు.డ్రాగన్ వేషాలు నచ్చి క్లాస్ మెట్ కీర్తి (అనుపమ పరమేశ్వర్) డ్రాగన్ ని ప్రేమిస్తుంది.డ్రాగన్ కూడా కీర్తిని ప్రేమిస్తాడు. కాలేజ్ ప్రిన్సిపాల్ మోహన్ బాబు( మిస్కిన్) కి మాత్రం డ్రాగన్ అంటే చాలా కోపం. ఈ క్రమంలోనే డ్రాగన్ అల్లరి భరించలేక కాలేజ్ నుంచి పంపించేస్తాడు.లైఫ్ లో బతకాలంటే  డ్రాగన్ లాంటి వాడు కరెక్ట్ కాదని,కీర్తి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.కీర్తి హస్బెండ్ కంటే ఎక్కువ జీతం తీసుకోవాలని రాంగ్ రూట్ లో డ్రాగన్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ సంపాదిస్తాడు.అంచలంచలుగా ఎదిగి నెలకి మూడు లక్షల జీతం అందుకునే రేంజ్ కి  వెళ్తాడు.నిజాయితితో కోటీశ్వరుడుగా ఎదిగిన పరశురామ్(కె ఎస్ రవికుమార్) కూతురు పల్లవి(కయదు లోహర్) తో డ్రాగన్ కి ఎంగేజ్మెంట్ అవుతుంది.డ్రాగన్,పల్లవి కూడా  ఒకరినొకరు ప్రేమించుకుంటారు.మోహన్ బాబు కి డ్రాగన్ చేసే ఉద్యోగం తెలియడంతో ఆఫీస్ కి వెళ్లి ‘డ్రాగన్’ కి ఒక కండిషన్ పెడతాడు.అందుకు భయపడిన డ్రాగన్ మళ్ళీ కాలేజ్ లో చేరతాడు.లెక్చరర్ గా కీర్తినే వస్తుంది. డ్రాగన్’ ఎందుకు మళ్ళీ కాలేజ్ కి వెళ్ళాడు? డ్రాగన్ విషయంలో లెక్చరర్ గా వచ్చిన కీర్తి ఏం చేసింది?ఎన్నో కలలు కన్న జాబ్ ఏమైంది? పల్లవితో పెళ్లి అయ్యిందా? డ్రాగన్   ఎందుకు మోహన్ బాబు పెట్టిన కండిషన్ కి ఒప్పుకున్నాడు? అసలు రాఘవన్ ఎందుకు డ్రాగన్ అనే బాడ్ స్టూడెంట్ గా మారాడు? అసలు డ్రాగన్ మంచోడా,చెడ్డోడా? డ్రాగన్ లక్ష్యం ఏంటి అనేదే ఈ కథ

ఎనాలసిస్

కాలేజ్ నేపథ్యంతో కూడిన సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి.కానీ ఈ మూవీ మాత్రం జీవితానికి సంబంధించిన విలువని కూడా నేటి యువతకి చెప్పింది.ఫస్ట్ హాఫ్  విషయానికి వస్తే బాగా చదివే రాఘవన్ ఎలా చెడిపోయాడు అనే పాయింట్ తో మూవీ ప్రారంభమయ్యింది.కానీ ఈ విషయాన్ని రెండు మూడు ఉదాహరణలుగా  చూపించాల్సింది.ఎందుకంటే అంత తెలివిగలవాడు ఒక అమ్మాయి వల్లే బలాదూర్ గా మారాల్సిన అవసరం లేదు.లేదా ఆ అమ్మాయి మీద రాఘవన్ కి ఉన్న ప్రేమని కొన్ని సన్నివేశాల ద్వారా చూపించాల్సింది.కాకపోతే ఈ విషయాన్నీ ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకునే అవసరం లేకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు చాలా చక్కగా సీన్స్ ని ఎలివేషన్ చేసుకుంటు వెళ్ళాడు.ముఖ్యంగా రాఘవన్ క్యారక్టర్ ద్వారా కొంత మంది యువత సరదాలతో తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో చాలా చక్కగా చూపించారు.కీర్తి క్యారక్టర్ ని కూడా ఈ తరం అమ్మాయలు ఎలా ఆలోచిస్తారో పర్ఫెక్ట్ గా తెలియచేసారు.పైగా కీర్తి ఆ విధంగా ఆలోచించడం కూడా కరెక్టే.రాఘవన్ అమ్మ,నాన్నలు కొడుకు భవిష్యత్తు కోసం పరితపించే సీన్స్ కూడా బాగున్నాయి.ప్రిన్సిపాల్ మోహన్ బాబు    సీన్స్ ,రాఘవన్ చాలా వేగంగా పెద్దోడు కావడం అయ్యే సీన్స్ కూడా కథకి చాలా బలాన్ని ఇచ్చాయి.ఆఫీస్ బాస్ తో వీడియో కాల్ లో ఇంటర్వ్యూ ని ఫేస్ చేసే సీన్ అయితే హైలెట్.ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది.సెకండ్ ఆఫ్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ కూడా ప్రేక్షకుల్లో కలిగించింది.మాజీ లవర్ టీచర్ గా రావడమనే థ్రిల్ ప్రేక్షకులకి బిగ్ సర్ప్రైజ్ ని ఇచ్చింది.కాకపోతే రాఘవన్,కీర్తి మధ్య వచ్చే సీన్స్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది.తనకి కీర్తి నెగిటివ్ గా ఉందని రాఘవన్ అనుకునేలా సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తు,ఆడియన్స్ కి మాత్రం రాఘవన్ కి కీర్తి మంచి చేస్తుందని చెప్పుండాల్సింది.ఆ విధంగా ప్రేక్షకుడు మరింత థ్రిల్ ఫీల్ అయ్యేవాడు.ఈ సినిమా కథ కి ఏ విషయం అయితే  ఆయువు పట్టో,ఆ విషయాన్నీ క్లైమాక్స్ కి ముందు ఒక్క నిమిషంలో తేల్చకుండా ఇంకొంచం ముందుకు తీసుకురావాల్సింది.తద్వారా ప్రేక్షకుడికి రాఘవన్ ఏం చేస్తాడో అనే క్యూరియాసిటీ ఉండేది.ఎందుకంటే ప్రేక్షకుడు రాఘవన్ గెలవాలని కోరుకుంటూ ఉంటారు.అలాంటిది చివర్లో అది కూడా చీటింగ్ అని తేలడంతో కొంత నిరుత్సాహం పడే అవకాశం ఉంది.ఎలాగూ చీటింగ్ చేస్తున్నాడు కాబట్టి ముందుగానే చెప్పాల్సింది.

నటీనటులు,సాంకేతిక నిపుణుల పని తీరు 

రాఘవన్ క్యారక్టర్ లో ప్రదీప్ రంగనాథన్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.అన్ని వేరియేషన్స్ లోను అధ్బుతంగా నటించి,మరోసారి అన్ని వర్గాల వారిని అలరించాడు.కీర్తి క్యారక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ స్టూడెంట్ గా.లెక్చరర్ గా తన క్యారక్టర్ కి 100 పర్సెంట్ న్యాయం చేసింది.పల్లవి క్యారక్టర్ లో కయదు లోహర్ కూడా పర్ఫెక్ట్ గా సూటయ్యింది. మిగతా క్యారక్టర్లలో చేసిన మిస్కిన్,గౌతమ్ వాసుదేవమీనన్,కెఎస్ రవికుమార్,జార్జ్ మర్యన్ లు తమ క్యారక్టర్ మాత్రమే కనపడేలా నటించారు.ఇక దర్శకుడు అశ్వత్ మారిముత్తు టేకింగ్ కానీ, క్యారక్టర్ లని ప్రెజెంట్ చేసిన విధానం గాని చాలా బాగుంది.రచనలో మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయి.లియోన్ జేమ్స్ అందించిన  సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉన్నాయి.ఫొటోగ్రఫీ,నిర్మాణ విలువలు అయితే  మూవీకి చాలా పెద్ద  ప్లస్.

ఫైనల్ గా చెప్పాలంటే… కథనంలో కొన్ని లోపాలు ఉన్నా కూడా వాటిని ప్రేక్షకుడు పట్టించుకోని విధంగా ఆర్టిస్ట్ లతో పాటు 24 క్రాఫ్ట్స్ బాగా పని చేసాయి.ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా యూత్ తో పాటు ఫ్యామిలీ చూసే మంచి మెసేజ్ తో కూడిన ఎంటర్ టైనర్

 

రేటింగ్ 2.75/5                                                                                                                                                                                                                                                                           అరుణాచలం 

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here