తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది మహానటులు తమ నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. వారి నటనకు ఫిదా అయిపోయిన ప్రేక్షకులు వారి పేర్ల ముందు కొన్ని గౌరవపదాల్ని ఉంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా నటరత్న, నటసామ్రాట్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్ వంటి బిరుదులు వారి పేర్ల ముందు చేరాయి. ఈ బిరుదుల్ని మరో స్టార్ హీరో పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కృష్ణ, కృష్ణంరాజు వారసులు మాత్రం ఆ స్థాయి నటనతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు కాబట్టి సూపర్‌స్టార్, రెబల్‌స్టార్ బిరుదుల్ని మహేష్, ప్రభాస్‌లకు తగిలించారు ప్రేక్షకులు. 1980వ దశకంలో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆర్.నారాయణమూర్తి రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కథాంశాలతో, ప్రేక్షకుల్ని చైతన్య పరిచే సినిమాల్లో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తను చేసే ప్రతి సినిమా ప్రజా సమస్యలపైనే ఉంటుంది. తన సినిమాలతో ప్రజల తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తారు. అందుకే ఆర్.నారాయణమూర్తిని పీపుల్స్‌స్టార్ అని ప్రేక్షకులు గౌరవంగా పిలుచుకుంటారు.
ఒక హీరో బిరుదును మరో హీరో తీసుకునే సాహసం ఎవరూ చేయలేదు. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ ఆ పని చేశాడు. తను చేస్తున్న తాజా మజాకా చిత్రం ప్రమోషన్స్‌లో తన పేరు ముందు పీపుల్స్ స్టార్ అనే బిరుదును తగిలించుకున్నాడు. ఇది చూసి సాధారణ ప్రేక్షకులు సైతం ఖంగు తిన్నారు. పీపుల్స్ స్టార్ అంటే నారాయణమూర్తి కదా.. సందీప్‌కిషన్‌కి ఆ బిరుదు ఎవరిచ్చారు అనే సందేహం అందరిలోనూ కలిగింది. ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఈవెంట్లో ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించింది. దానికి సందీప్ కిషన్ చెప్పిన సమాధానం అందర్నీ షాక్‌కి గురిచేసింది. నారాయణమూర్తికి పీపుల్స్ స్టార్ అనే బిరుదు ఉందనే విషయం తనకి తెలీదని, అందుకే ఆ ట్యాగ్ తాను తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.
సినిమా అంటేనే అబద్ధం అంటారు కొందరు. వాస్తవ జీవితానికి పూర్తి భిన్నంగా ఉండేదే సినిమా. అలాంటి అబద్ధాన్ని కూడా ఎంతో అందంగా చూపించే దర్శకులు ఉన్నారు కాబట్టే సినిమాలు విజయవంతం అవుతున్నాయి. కానీ, వాస్తవ జీవితంలో కూడా అబద్ధాన్ని నిజం చేయాలని సందీప్ కిషన్ ప్రయత్నించడం దారుణమని అంతా భావిస్తున్నారు. ఆర్.నారాయణమూర్తి గురించి తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి చిన్నపిల్లల్ని పీపుల్స్ స్టార్ ఎవరు అంటే ఠక్కున సమాధానం చెబుతారు. అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలోనే ఉంటూ నారాయణమూర్తి గురించి తెలుసు కానీ, అతనికి ఉన్న బిరుదు ఏమిటో తనకు తెలీదని చెప్పడం వల్ల సందీప్ కిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని అతను గ్రహించకపోవడం ఆశ్చర్యం. పాతతరం కళాకారులను, లెజెండ్స్‌గా పేర్కొంటున్న కొందరు నటీనటుల్ని మనం ఏ విధంగానైనా అవమానించవచ్చు, ఏమైనా అనొచ్చు అనే ధోరణిని నుంచి ఇప్పటి యంగ్ హీరోలు బయటికి రావాలి.