టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల సినిమాలన్నీ ఒకే నెలలో రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు, ఆయా హీరోల అభిమానులకు పండగే కదా. అలాంటి పండగ వచ్చే నెలలోనే రాబోతోంది. మహేష్, ప్రభాస్, వెంకటేష్, కార్తీ, నాని, విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు మార్చి నెలలో విడుదల కాబోతున్నాయి. అయితే అవి కొత్త సినిమాలు కాదు అనే విషయం గమనించాలి. గతంలో సూపర్‌హిట్ అయిన ఎన్నో సినిమాలను రీ రిలీజ్ చేసి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పట్లో డిజాస్టర్లుగా, ఫ్లాప్‌గా నిలిచిన సినిమాలు కూడా రీ రిలీజ్ అయి ఘనవిజయం సాధిస్తున్నాయి, కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చే నెల మరికొన్ని సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి.
రీరిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్. రిలీజ్ అయిన కొన్ని నెలల్లోనే ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం అనేది అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు సలార్ 2 కోసం ఎదురుచూస్తున్న సమయంలో సలార్ రీరిలీజ్ అవ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బాక్సాఫీస్ వద్ద మరోసారి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. మార్చి 21న సలార్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇదే నెలలో మహేష్, వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు, నాని, విజయ్ దేవరకొండ నటించిన ఎవడే సుబ్రమణ్యం రిలీజ్ కాబోతున్నాయి. ఫస్ట్ టైమ్ ఒకే నెలలో ఇన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ ఓటీటీలో వచ్చేసినప్పటికీ థియేటర్లలో మరోసారి ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు ప్రేక్షకులు. అయితే సలార్‌పైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.