నటీనటుల: సందీప్ కిషన్, రీతువర్మ, రావు రమేష్, మురళీశర్మ, అన్షు, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, హైపర్ ఆది తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
స్క్రీన్‌ప్లే: సాయికృష్ణ
నిర్మాతలు: రాజేష్ దండా, ఉమేష్ కె.ఆర్. బన్సాల్
బ్యానర్స్: ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
విడుదల తేదీ: 26.02.2025
విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన నటుడు సందీప్ కిషన్. ఇటీవలికాలంలో కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో, మరికొన్ని సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సందీప్ హీరోగా నటించిన మా ఊరు భైరవకోన కమర్షియల్ మంచి సక్సెస్ అయింది. అలాగే ధనుష్ డైరెక్షన్లో వచ్చిన రాయన్‌లో కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ‘మజాకా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రినాథరావు నక్కిన సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మజాకా’తో ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేశారు? సందీప్ కిషన్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అయింది? ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలు ఏమిటి? అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఓపెన్ చేస్తే ఇద్దరు వ్యక్తులు రక్తపు మరకలతో సముద్ర తీరాన పడి ఉంటారు. అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తాడు. అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్(అజయ్) ఇద్దరి బాడీలను పరిశీలించి వాళ్ళు చనిపోలేదని, మందు ఎక్కువై పడి ఉన్నారని గ్రహించి ఇద్దరినీ తట్టి లేపుతాడు. వారిద్దరూ తండ్రీ కొడుకులు. అలా వారు తప్ప తాగి పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతారు. తను ఓ నవల రాస్తున్నానని, దానికి మంచి పాయింట్ కావాలని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆ తండ్రీకొడుకులు వారి కథ చెప్పడం మొదలుపెడతారు. తండ్రి పేరు రమణ(రావు రమేష్), కొడుకు పేరు కృష్ణ( సందీప్ కిషన్). తల్లి లేని కొడుక్కి పెళ్లి చేస్తే తమకూ ఓ ఫ్యామిలీ ఏర్పడుతుందని భావించిన రమణ.. కృష్ణకు సంబంధాలు చూస్తుంటాడు. కానీ, ఇద్దరు మగాళ్ళున్న ఇంటికి ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తామనే కారణం వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయి. అయితే కొడుక్కి పెళ్లి చేయాలంటే తను పెళ్లి చేసుకోవాలని పంతులు చెప్పిన మాట విని రమణ ఓ తోడు కోసం చూస్తుంటాడు. ఆ సమయంలోనే యశోద(అన్షు) తారసపడుతుంది. కుర్రాడిలా ఫాలో చేస్తూ ఆమెకు లైన్ వేస్తుంటాడు. మరోపక్క మీరా అనే అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు కృష్ణ. కానీ, వారిద్దరూ రమణను, కృష్ణను ప్రేమించరు. కానీ, ఒక విచిత్రమైన పరిస్థితిలో వారి ప్రేమలో పడిపోతారు. ఆ సమయంలోనే యశోద, మీరా మేనత్త, మేనకోడలు అనే విషయం బయటపడుతుంది. అయితే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ద్వేషం ఉంటుంది. ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటే ఒక మంచి ఫ్యామిలీ ఏర్పడుతుందని భావించిన రమణ, కృష్ణ షాక్ అవుతారు. వారిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో గొడవలు తప్పవని భావించిన తండ్రీకొడుకులు వారి మధ్య గ్యాప్‌ని తొలగించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి ఆ ప్రయత్నంలో ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? బద్దశత్రువులుగా ఉన్న మేనత్త, మేనకోడలు ఒక్కటయ్యారా? రమణ, కృష్ణలను పెళ్లి చేసుకున్నారా? ఈ క్రమంలో కథలో వచ్చే ట్విస్టులు ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
గతంలో ఈ తరహా కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఒక ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తియ్యాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. కామెడీ టచ్ ఇచ్చేందుకు ‘మజాకా’ అనే టైటిల్ పెట్టినప్పటికీ ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తుంది. ఓ సాదా సీదా సినిమాగా ప్రారంభమై ఓ అరగంట పాటు పేలవమైన కథనంతో, అతి పేలవమైన డైలాగులతో నడుస్తుంది. కామెడీ చేస్తున్నామని రావు రమేష్, సందీప్ కిషన్ చెప్పే డైలాగులు అక్కడక్కడా పేలాయి తప్ప మిగతా అంతా పరమ రొటీన్‌గా అనిపించింది. ఆ తర్వాత మరో 40 నిమిషాలు మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. కొన్ని డైలాగులు కూడా కామెడీగా ఉన్నాయి. ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో తాము ఇష్టపడిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేందుకు తండ్రీ కొడుకులు పడే తిప్పలు పరమ రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో సినిమాను అనవసరంగా లాగుతున్నారనే భావన కూడా కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్టులు.. తర్వాత ఏం జరగబోతోంది అనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఫక్తు కమర్షియల్ సినిమాలో మాదిరిగా లాజిక్‌కి ఏమాత్రం అందని ఎత్తులు, పైఎత్తులు చాలా ఉంటాయి. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు త్రినాథరావు చేసిన ప్రయత్నం మంచిదే అయినా పాత ఫార్ములా కావడంతో ఓ కొత్త సినిమా చూస్తున్నామనే భావన ప్రేక్షకుల్లో కనిపించదు.
నటీనటులు:
సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కువగా కనిపించే క్యారెక్టర్లు రమణ, కృష్ణ. సందీప్ కిషన్ చేసిన క్యారెక్టర్ కొత్తగా ఏమీ ఉండదు. అంతకుముందు కొన్ని సినిమాల్లో ఆ తరహా క్యారెక్టర్ చేశాడు. అందుకే దానిలో వైవిధ్యం కనిపించదు. ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు అతని ఈ తరహా క్యారెక్టర్ చెయ్యలేదు. కుర్రాడిలా అమ్మాయి వెంట పడుతూ, స్టెప్పులేస్తూ, జాలీగా మాట్లాడుతూ చేసిన క్యారెక్టర్ అతనికి స్పెషల్ అనే చెప్పాలి. ఈ క్యారెక్టర్ని రావు రమేష్ సమర్థవంతంగా పోషించారనే చెప్పాలి. ఇక రీతు వర్మ, అన్షు చేసిన క్యారెక్టర్లలో కొంత వైవిధ్యం ఉంది. అయితే ఈ ఇద్దరి వల్ల సినిమాలో గ్లామర్ అనేది పూర్తిగా లోపించింది అనే భావన కలుగుతుంది. రీతువర్మ అందంగా కనిపించాల్సిన ఎన్నో సీన్స్‌లో భయంకరంగా కనిపించి ఆడియన్స్‌ని కంగారు పెట్టింది. ఇక అన్షు తన ఏజ్‌కి తగిన క్యారెక్టరే అయినా ఆమెలో నిండుతనం కనిపించలేదు. ఫలితంగా హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులు నిరాశ చెందుతారు. మిగతా క్యారెక్టర్లలో మురళీశర్మ చేసిన విచిత్రమైన క్యారెక్టర్ అక్కడక్కడా ఎంటర్టైన్ చేస్తుంది. సైకో తరహా క్యారెక్టర్ అతను తన పాత్రకు న్యాయం చేశాడు. శ్రీనివాసరెడ్డి, హైపర్ ఆది, రఘుబాబు వంటి వారిని సినిమాలో ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంది తప్ప వారి క్యారెక్టర్లకు అంత ప్రాధాన్యం లేదు.
సాంకేతిక నిపుణులు:
సాంకేతిక పరంగా సినిమాకు ఎక్కువ మార్కులు వేయలేం. మొదట ప్రేక్షకుల్ని నిరాశపరిచేది సినిమాటోగ్రఫీ. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ సీన్లోనూ అద్భుతం అనిపించే ఫోటోగ్రఫీ కనిపించదు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అందులోనూ ఎలాంటి మెరుపులు కనిపించవు. రెండున్నర గంటల సినిమాలో ఫలానా సీన్ లేకపోయినా కథకు ఎలాంటి నష్టం లేదు అనుకునే సీన్స్ కట్ చేసి ఉంటే లెంగ్త్ కాస్త తగ్గి ఉండేది. సినిమాలో పాటలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపించలేదు. సినిమాలో పాటలు ఉండాలి కాబట్టి కొన్ని పాటలు పెట్టారు. ‘సొమ్మసిల్లి పోతన్ననే..’ అనే పాట ఒక్కటే ఆకట్టుకునేలా ఉంది. బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన కామెడీ డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్వు తెప్పించాయి. కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగినట్టు లేదు. ముఖ్యంగా చాలా సీన్స్‌లో ఆర్టిస్టులు చెప్పే డైలాగుల్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేసింది. దాంతో చాలా డైలాగులు అర్థం కావు. సినిమాలో రెండు మూడు ఫైట్స్ ఉన్నాయి. వాటిని మాత్రం ఫైట్ మాస్టర్ పృథ్వీ వెరైటీగా డిజైన్ చేశాడని చెప్పొచ్చు. డైరెక్టర్ త్రినాథరావు గురించి చెప్పాలంటే.. కథలో తను అనుకున్న పాయింట్‌ని ప్రేక్షకులకు కొత్తగా చెబితే బాగుండేది. ఈ తరహా కథాంశాలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ ధోరణిలోనే ఇతనూ వెళ్లిపోయాడు. అయితే కొన్ని చోట్ల ఇచ్చిన ట్విస్టులు, కొన్ని సెంటిమెంటల్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ఫర్వాలేదు అనిపించాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే..
పాత కథనే కొత్త ఫార్మాట్ చూపించాలని చేసిన ప్రయత్నం పార్టులు పార్టులుగా సక్సెస్ అయింది తప్ప పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. సినిమా ప్రారంభమే ఒక పేలవమైన సీన్ ఉంటుంది. ఆ తర్వాత రొటీన్ కామెడీ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చెయ్యాలని చూసినా అది వర్కవుట్ కాలేదు. సినిమాలో రావు రమేష్, సందీప్ కిషన్, మురళీశర్మ క్యారెక్టర్లు, వారితో చెప్పించిన డైలాగులు సినిమాని కొంత భాగం వరకు లాక్కెళ్లాయి. కుటుంబ కథ, సెంటిమెంట్‌తోపాటు చక్కని ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వారు ఒక్కసారి చూడొచ్చు.
రేటింగ్: 2.25