భారత మీడియాలో పెనుమార్పులు
భారత మీడియా పరిశ్రమ పెనుమార్పులకు లోనవుతోందని, సంప్రదాయ మాధ్యమాలు డిజిటల్ ల్యాండ్ స్కేప్ కు అనుగుణంగా ఎలా మారవచ్చో పరిశీలించడం ముఖ్యమని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘‘ప్రస్తుతం మీడియా రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయ మాధ్యమాల్లో వార్తాపత్రికలు, టెలివిజన్ ప్రధాన మాధ్యమాలుగా ఉండేవి. కానీ డిజిటల్ మీడియా ఇప్పుడు గణనీయమైన రీతిలో ఆవిర్భవించింది. చాలా చోట్ల, ముఖ్యంగా యువతలో సంప్రదాయ మీడియా నుంచి డిజిటల్ మీడియాకు పూర్తిగా మారిపోయింది’’ అని వైష్ణవ్ తన కీలకోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ పరివర్తన నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లను పరిష్కరించడానికి మీడియా, విధానకర్తలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. ఉపాధి, కాపీరైట్, న్యాయమైన పరిహారానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల మద్దతును అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.