ఇటీవలికాలంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు రకరకాల కారణాలతో పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక విధంగా చూస్తే వివాదాలు, నేరాలు సినిమారంగంలో కూడా బాగా పెరిగిపోయాయి. అందులోనూ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నేరం చేసినవారు ఎంతో త్వరగా పోలీసుల చేతికి చిక్కుతున్నారు. అలా చిక్కిన ప్రముఖులు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. తాజాగా క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో స్టార్‌ హీరోయిన్లు తమన్నా, కాజల్‌ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. పాండిచ్చేరిలో జరిగిన ఈ స్కామ్‌లో పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేశారు. దీనితో సంబంధం ఉందంటూ కాజల్‌, తమన్నా పేర్లు కూడా బయటకి వచ్చాయి. త్వరలోనే పోలీసులు వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అన్నిరకాల మాధ్యమాలలో వీరిద్దరి పేర్లు స్కామ్‌లో ఉన్నాయంటూ కథనాలు పబ్లిష్‌ అయ్యాయి. 

క్రిప్టో కరెన్సీకి సంబంధించి స్కామ్‌ జరుగుతోందంటూ అశోకన్‌ విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇప్పుడు పోలీసుల దృష్టి కాజల్‌, తమన్నాలపై ఉందట. మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై తమన్నా స్పందించింది. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆమె ఖండిరచింది. తనపై ఆరోపణలు చేస్తూ వీడియోలు చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తనను అప్రతిష్ట పాలు చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తోంది. ‘క్రిప్టో కరెన్సీ కేసులో స్కామ్‌ జరిగిందని, ఇద్దరిని అరెస్ట్‌ చేశారని వార్తలు రావడం నేను చూశాను. అయితే అందులో నేను కూడా ఉన్నానంటూ వస్తున్న వార్త చూసి షాక్‌ అయ్యాను. ఇలాంటి తప్పుడు కథనాలను దయచేసి ఎవ్వరూ నమ్మొద్దు. దయచేసి నాపై అలాంటి వీడియోలు చేయకండి’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది తమన్నా. ఈ విషయంలో కాజల్‌ మాత్రం స్పందించలేదు. ప్రచారంలో ఉన్న వార్తలో నిజమెంత.. కాజల్‌, తమన్నాలకు కేసుతో సంబంధం ఉందా లేదా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here